Vijayashanthi: ఇప్పటికే మూడు, నాలుగు పొలిటికల్ పార్టీలు మారిన విజయశాంతి ఇప్పుడు బీజేపీలో సెకండ్ ఇన్నింగ్స్‌ని కూడా కొనసాగించే సూచనలు కనిపించట్లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలైన ఆమె తాజాగా రాష్ట్ర నాయకత్వంపై అత్యంత స్పష్టంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విజయశాంతికి స్టేట్ లెవల్‌లో ఏ బాధ్యతలూ అప్పగించే అవకాశాల్లేవని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ఆమె వ్యవహారశైలి క్రమశిక్షణారాహిత్యం కిందికి వస్తుందని చెబుతున్నారు. ఏదైనా ఉంటే పార్టీ అంతర్గత వేదికలపైన వెల్లడించాలి గానీ ఇలా బహిరంగంగా మీడియా ముందు మాట్లాడటం సరికాదంటూ హైకమాండ్‌కు సైతం ఆమెపై ఆగ్రహం వచ్చే వీలుందని భావిస్తున్నారు.
కాబట్టి విజయశాంతి వాదనను ఢిల్లీలోని పార్టీ పెద్దలూ ఆలకించకపోవచ్చని సమాచారం. అందువల్ల ఆమె చివరికి బీజేపీనీ వీడక తప్పని పరిస్థితి తలెత్తొచ్చని అనలిస్టులు అంటున్నారు. విజయశాంతి ఇప్పటికీ తానో లేడీ సూపర్ స్టార్‌నని అనుకుంటున్నారని, అది సినిమాల్లో నడుస్తుంది గానీ రాజకీయాల్లో పనికిరాదని అభిప్రాయపడుతున్నారు. రీల్ లైఫ్‌కి, రియల్ లైఫ్‌కి చాలా తేడా ఉంటుంది. ఆ వ్యత్యాసాన్ని అటు ఏపీలో పవన్ కళ్యాణ్, ఇటు తెలంగాణలో విజయశాంతి గ్రహించలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాళ్ల మాటలే దీన్ని వ్యక్తం చేస్తున్నాయని పలువురు గుర్తుచేస్తున్నారు. ‘నేను రాములమ్మను. నా లెవల్ ఎప్పుడూ టాపే’ అని విజయశాంతి వ్యాఖ్యానించటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.
ఖమ్మంలో నన్ను ఎదురించే మొనగాడు ఎవడు ..!?
నిజానికి వీళ్ల పట్ల ప్రజల్లో చాలా అభిమానం ఉందనేది అందరూ ఒప్పుకునేదే. కానీ ఆ ఫాలోయింగ్ పాలిటిక్స్‌కి సింక్ కావట్లేదని ఎన్నికల ఫలితాలు కూడా తేల్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లు ఓడిపోవటమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. రాజకీయాల గురించి మాట్లాడుకోవాలంటే తెలంగాణ బీజేపీలో ఇప్పుడు బండి సంజయే హీరో అని ఆ పార్టీ కేడర్ టాక్. మిగతావాళ్లు సీనియర్లు అయినప్పటికీ సైడ్ హీరోలేనని క్లారిటీ ఇస్తున్నారు. కానీ ఇక్కడ కూడా నేనే బాస్‌నని విజయశాంతి భావిస్తున్నట్లు ఆమె వ్యాఖ్యల్నిబట్టి అర్థమవుతోందని చెబుతున్నారు. దీంతోనే అసలు సమస్య వచ్చిపడుతోందని, జాతీయ కార్యవర్గంలో సభ్యురాలి పోస్టు పొందిన ఆమె మళ్లీ రాష్ట్ర నాయకత్వం నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సింది ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం ఏదైనా చేయాలంటే డైరెక్టుగా ఢిల్లీ నుంచే గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవచ్చు కదా అని పేర్కొంటున్నారు.
అది వదిలేసి బండి సంజయ్ మీదో, లక్ష్మణ్ మీదో మండిపడితే ఏం వస్తుందని బీజేపీ వర్గాలు నిలదీస్తున్నాయి. తనకు ఏదైనా అసంతృప్తి ఉంటే దాన్ని అధిష్టానం దగ్గర చెబితే బాగుండేదని, మీడియా ముందు అసహనం ప్రదర్శించటం ద్వారా ఆమెకే కాకుండా పార్టీకి కూడా నష్టం కలిగించే ప్రయత్నం చేశారని తప్పుపడుతున్నారు. ఏమాటకామాటే. విజయశాంతి పెద్ద వక్తేమీ కాదనేది రాజకీయ పరిశీలకుల ఉద్దేశం. ఆమెలో సబ్జెక్ట్ కూడా ఉన్నట్లు కనిపించదని ఆఫ్ ది రికార్డ్ చర్చించుకుంటున్నారు. ఏదో.. కేసీఆర్ పైన నాలుగు సినిమా డైలాగుల టైపులో ఘాటు విమర్శలు చేయటం తప్ప ఆమె ఫలానా అంశంపైన ప్రసంగం దంచి కొట్టిన సందర్భమే లేదని వేలెత్తి చూపుతున్నారు. ఒకప్పటి అగ్ర కథానాయిక అనే అర్హత మాత్రమే విజయశాంతిని ఈ స్థాయికి తీసుకొచ్చిందని గుర్తుచేస్తున్నారు.
విజయశాంతి ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే ఎంపీ అయిందంటే అది టీఆర్‌ఎస్ పార్టీ ప్రభావం వల్లే తప్ప ఆమె రాజకీయ పలుకుబడి వల్ల మాత్రం అస్సలు కాదని గులాబీ పార్టీ శ్రేణులు అప్పుడప్పుడూ అంటుంటాయి. పొమ్మనలేక పొగ పెడుతున్నా విజయశాంతి బీజేపీలోనే కొనసాగటం మంచిదని. లేదా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవటం బెటర్ అనేది ఆమె అభిమానుల ఒపీనియన్. విజయశాంతి ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరే పార్టీలోకి వెళితే జనం నవ్వుతారని అంటున్నారు. బీజేపీతో పొలిటికల్ కెరీర్‌ను ప్రారంభించి తల్లితెలంగాణ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మీదుగా ప్రయాణం చేసి మళ్లీ కమలం పార్టీలోకే వచ్చిన ఆమె మరోసారి టీఆర్‌ఎస్‌లోకి గానీ కాంగ్రెస్‌లోకి గానీ వెళితే ‘సెకండ్ ఇన్నింగ్స్’ లీడర్ అనే సెటైర్లు ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.