శివసేనకు పట్టిన గతే టీఆర్ఎస్‌కు పడుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ప్రధాని మోదీ సభ ఉండబోతోందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ఇవాళ శుక్రవారం ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌లో విజయ సంకల్ప సభ ఏర్పాట్లను లక్ష్మణ్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణపై ప్రధాని మోదీ, నడ్డా, అమిత్ షా లు ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. తెలంగాణలో రామరాజ్యం రావటానికి ఏడాది మాత్రమే వుందని, ఇది ఖాయమని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని విమర్శించారు. సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో .. హార్డింగ్స్, ఫ్లెక్సీల విషయంలో టీఆర్ఎస్ ది చిల్లర రాజకీయమని ఆయన మండిపడ్డారు. అయితే.. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలసి పోటీ చేయనున్నాయని తెలిపారు.
అంతేకాకుండా.. కాంగ్రెస్‌కు బీ పార్టీగా టీఆర్ఎస్, ఎంఐఎంలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో కుటుంబ పార్టీలు కనుమరుగవటం ఖాయమని తెలిపారు. అయితే.. పుత్ర వాత్సల్యం వలన శివసేనకు పట్టిన గతే టీఆర్ఎస్‌కు పడుతుందని హెచ్చరించారు. కాగా.. ఆదివాసీ రాష్ట్రపతి అవుతుంటే టీఆర్ఎస్ నాయకత్వం ఓర్వలేకపోతోందని మండిపడ్డారు. ఈనేపథ్యంలో.. ఆదివాసీని రాష్ట్రపతిని చేస్తోన్న ఘనత 70 ఏళ్ళల్లో బీజేపీకి దక్కుతుందని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు టీఆర్ ఎస్ పరిస్థితి అంటూ విమర్శించారు.