లంగాణలో వివిధ దృష్టిలోపాలతో ఇబ్బందులు పడుతున్నవారికి ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో దృష్టి లోపంతో బాధపడుతున్న వారి లోపాలను నివారించేందుకే కంటి వెలుగు కార్యక్రమాన్ని మరోమారు అమలు చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమం అమలు ప్రణాళికపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులతో జగిత్యాల కలెక్టరేట్ నుండి మంత్రి హరీశ్‌రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్యారోగ్య శాఖ కమిషనర్ శ్వేత, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా అదనపు కలెక్టర్ మందా మకరంద్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి హాజరయ్యారు.
తొలివిడత కంటి వెలుగు విజయవంతం చేసిన విధంగానే అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలన్నారు మంత్రి హరీష్ రావు. ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరం ఉన్నవారికి ఉచితంగా అద్దాల పంపిణీ చేపడతామన్నారు. పంచాయతీ, మున్సిపల్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని, కంటి వెలుగు పరీక్షా కేంద్రాలకు వచ్చేవారికి అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని, అధికారులు అంకితభావంతో పనిచేయాలన్నారు. కంటి వెలుగు కార్యక్రమ అమలుపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ లు, అదనపు కలెక్టర్ లతో జిల్లా వైద్యాధికారులతో సమీక్షలో పలు సూచనలు చేశారు. 1.54 కోట్లమందికి ఉచితంగా కంటి పరీక్షలు చేయనుంది.
25 లక్షలమందికి దగ్గరి చూపు కంటి అద్దాలు, 15 లక్షలమందికి దూరం చూపు కంటి అద్దాలు, మొత్తం 40 లక్షల కంటి అద్దాలు అందించనుంది. తొలివిడత కంటివెలుగు కార్యక్రమం 2018, ఆగస్టు 15న ప్రారంభం అయి, 2019 మార్చి 31 తో ముగిసిన సంగతి తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 10 వేల గ్రామాల్లో కోటి 54 లక్షలమందికి పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్ లో 8,92,256 మంది అత్యథికంగా, రంగారెడ్డి జిల్లాలో 8,60,891 మంది, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 8,28,822 మంది పరీక్షలు చేయించుకున్నారు. కళ్ళద్దాలు 23, 41, 636 మందికి అందచేశారు. 95 శాతం లక్ష్యం సాధించారు. ఈసారి కూడా అవసరం అయిన వారికి పరీక్షలు, కంటి అద్దాలు అందించాలని భావిస్తున్నారు.