ఓదార్పు యాత్రలో జగన్‌లో ప్రజలు ఒక నాయకుడిని చూశారని, ప్రజల్లో ఉండాలనే నా ఆలోచనను ఓదార్పు యాత్రలో జగన్ తో పంచుకున్నానని తెలిపారు ఎమ్మెల్యే వరప్రసాద్. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ మాట్లాడుతూ.. నా ఆలోచనలకు జగన్ మోహన్ రెడ్డి అవకాశం కల్పించారన్నారు. పాదయాత్రలో జగన్ మోహన్ రెడ్డి వెంట నడిచానన్నారు. జగన్ మోహన్ రెడ్డి పథకాలను ప్రకటిస్తుంటే ఇది సాధ్యమేనా అనుకున్నా అని, మేనిఫెస్టోను ఒక మత గ్రంధంలా చూస్తానంటే ఆలోచనలో పడ్డా అని ఆయన తెలిపారు. రాజకీయాల్లో మార్పు రావాలని కోరుకునే పౌరుల్లో నేనూ ఒకడిని అని, మేనిఫెస్టోను క్రమబద్ధంగా అమలు చేస్తుండటం చూస్తే చాలా ఆనందంగా ఉందన్నారు.
జగన్ మోహన్ రెడ్డి వినూత్నమైన పాలన అందిస్తున్నారన్నారు. దూరపు ఆలోచనలతో పాలన చేసే నాయకులు చాలా అరుదు అని, విద్యకు ప్రాధాన్యం కల్పిస్తున్న విధానం అభినందనీయమన్నారు. ఓ దళిత సామాజికవర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా నాకు చాలా సంతోషంగా ఉందని, వ్యవసాయానికి జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. పొలంబడి కార్యక్రమం ద్వారా వ్యవసాయానికి సంబంధించి సూచనలు అందిస్తున్నారని ఆయన తెలిపారు. పేదలకు మేలు చేసే ప్రభుత్వాలే కలకాలం ఉంటాయని, జగన్ మోహన్ రెడ్డి కలకాలం సీఎంగా కొనసాగాలన్నారు.