టెంపుల్ సిటీ తిరుపతిలో పట్టపగలు భారీ దారి దోపిడీ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు గంటలో దుండగులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన నలుగురు వ్యక్తులు ఒక కారులో భూమి రిజిస్ట్రేషన్ కోసం 35 లక్షల రూపాయల నగదు తీసుకొచ్చారు. పూతలపట్టు నాయుడుపేట నేషనల్ హైవే బాలాజీ డైరీ సమీపంలో ఆగి ఉన్నారు. కర్ణాటక రిజిస్ట్రేషన్ నెంబర్ గల టవేరా వాహనంలో వచ్చిన సుమారు 7మంది దుండగులు కళ్లలో కారం కొట్టి 35 లక్షల నగదు గల బ్యాగును దోచుకెళ్లారు.
అక్కడే ఉన్న ఓ వ్యక్తి డైల్ 100కు ఫోన్ చేయడంతో వారు హైవే లో ఉన్న రక్షక్ పోలీసులను అలెర్ట్ చేశారు. టవేరా వాహనం చిత్తూరు వైపుకు వెళుతుండగా చంద్రగిరి పోలీసులకు సమాచారం అందించారు. చంద్రగిరి పోలీసులు గాదెంకి టోల్ ప్లాజా వద్ద కాపు కాసి పట్టుకున్నారు. కారుతో పాటు నగదు 7 మంది నిందితులను అదుపులోకి తీసుకుని ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం తెలుపుతామని సిఐ సురేందర్ రెడ్డి తెలిపారు.
యువతి హత్యకేసులో నిందితుడి అరెస్ట్
మరోవైపు గత నెల 29వ తారీఖున జరిగిన యువతిపై అత్యాచారం, హత్య కేసులో నిందితున్ని అరెస్ట్ చేశారు అరకులోయ సర్కిల్ పోలీసులు. అరకులోయ సిఐ జీడి బాబు మాట్లాడుతూ డుంబ్రిగుడ మండలం కొల్లాపుట్ పంచాయతీ నందివలస గ్రామంలో గెమ్మెల్లి సావిత్రి 20 యువతిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. ప్రాథమిక సాక్షాలను బట్టి అత్యాచారం, అనంతరం హత్య జరిగినట్లుగా కేసు నమోదు చేశామని, గ్రామస్తులు తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు జన్ని రామచందర్ ఈ సంఘటనకు బాధ్యుడిగా అరెస్టు చేశామన్నారు. సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని ఈ సంఘటనలో జన్ని రాంచందర్ ఒక్కడే పాల్గొన్నట్లు మా విచారణలో తేలిందన్నారు. ముద్దాయిని కోర్టులో హాజరపరిచి రిమాండ్కు తరలించామని సిఐ జీడి బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో డుంబ్రిగుడ ఎస్సై సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.