నెల్లూరులో దారుణఘటన జరిగింది. బాలిక ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. బాలిక గొంతు కోసి..యాసిడ్ దాడికి పాల్పడ్డాడో నిందితుడు. బాలిక ప్రతిఘటించడంతో కత్తితో దాడి చేశాడు. దీంతో బాలిక తీవ్రంగా గాయపడింది. బాలికపై యాసిడ్ పోసిన నిందితుడు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యాసిడ్ దాడికి గురైన బాలిక పరిస్థితి విషమంగా వుందని తెలుస్తోంది. బాలికకు చికిత్స అందుతున్నా.. ఆహారం తీసుకోవడం ఆమెకు కష్టంగా వుందని వైద్యులు చెబుతున్నారు.
వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. బాధిత బాలిక ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. బాలికను ఇంట్లోనే ఉంచి తల్లిదండ్రులు నిన్న సాయంత్రం బయటకు వెళ్లారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తించిన నాగరాజు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. అతడి నుంచి తప్పించుకున్న బాలిక వాష్‌రూములోకి వెళ్లి తలుపులు మూసే ప్రయత్నం చేసింది. తలుపులు బలంగా నెట్టి లోపలికి వెళ్లిన నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆమె ఆ మృగాడినుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే, ప్రతిఘటించడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు నిందితుడు నాగరాజు. తన వెంట తెచ్చిన యాసిడ్‌ను ఆమె ముఖంపై, నోట్లోను పోశాడు. బాధతో బాలిక పెద్దగా కేకలు వేయడంతో గొంతు కోసి పరారయ్యాడు. చుట్టుపక్కల వారు వచ్చి జరిగిన ఘాతుకాన్ని చూసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకున్నారు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న కుమార్తెను నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.