పవన్‌ కల్యాణ్‌పై పోటీకి సిద్ధమవుతోన్న ఆలీ.. మరి ఎక్కడి నుంచో..?

0
1200

ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు ఆలీ సంచలన ప్రకటన చేశారు.. తెరపై పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో ఎన్నో సినిమాల్లో నటించిన ఆయనకు వ్యక్తిగతంగానూ మంచి సంబంధాలే కొనసాగాయి.. ఆ తర్వాత కొంత డ్యామేజ్‌ జరిగినట్టు వార్తలు వచ్చాయి.. ఇక, వైసీపీలో ఉన్న ఆలీ.. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌పై ఎన్నికల్లో పోటీ చేసేందుకు సై అంటున్నారు.. నగరిలో కొండచుట్టు ఉత్సవం సందర్బంగా నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆలీ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. పవన్ కల్యాణ్‌పై పోటీ చేయడానికి సిద్ధం అని ప్రకటించారు.. పార్టీ ఆదేశాలు చేస్తే పవన్‌పై నిలబడ్డానికి నేను సిద్ధం అన్నారు.. ఇక, రాష్ట్రంలోని 175 స్థానాలకు.. 175 స్థానాల్లోనూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులే గెలుస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. రానున్న ఎన్నికల్లో వందకు వందశాతం వైసీపీ గెలుస్తుందన్నారు.

నగరి నుంచి మరోసారి రోజా కూడా విజయం సాధిస్తుందన్నారు.. మంత్రి రోజాపై పవన్‌ కల్యాణ్‌.. డైమండ్‌ రాణి కామెంట్లపై స్పందించిన ఆలీ… డైమండ్ అనేది చాలా పవర్ పుల్.. చాలా విలువైనది.. రోజా కూడా తగ్గేదే లేదు.. అమె ఫైర్‌ బ్రాండ్‌.. ఆ విషయం అందరికీ తెలుసన్నారు.. అయితే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎవరు మేలు చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు.. ఇక, మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యామిలీతో మంత్రి రోజాకు సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు.. రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం సాధారణ విషయంగా పేర్కొన్న ఆయన.. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని స్పష్టం చేశారు.. కాగా, పవన్‌ కల్యాణ్‌పై పోటీ చేసేందుకు తాను సిద్ధమంటూ.. ఆలీ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి.. వచ్చే ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారు.. వైసీపీ అధిష్టానం ఆదేశిస్తే.. నిజంగానే ఆలీ అదే స్థానం నుంచి పోటీ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here