తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో కొంత కాలంగా.. ఈ సారి ఎన్నికల్లో మళ్లీ సిట్టింగ్‌లకే అవకాశం ఇస్తారా? వేరే వాళ్లను బరిలోకి దింపుతారా? కేసీఆర్ మదిలో ఏముంది.. సిట్టింగ్‌ల సీట్లకు ఎసరు రావడం ఖాయమేనా అనే ప్రచారం సాగింది.. సర్వేలు నిర్వహించిన కేసీఆర్.. సిట్టింగ్‌లపై గట్టిగా వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాల్లో మరో నేతకు టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందనే గుసగుసలు వినిపించాయి.. అయితే, దీనిపై ఇవాళ తేల్చేశారు గులాబి దళపతి కేసీఆర్.. తెలంగాణ భవన్ వేదికగా జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మరోసారి సిట్టింగ్‌లకు అవకాశం ఇస్తాం.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మె ల్యేలను మార్చే ప్రసక్తే లేదని స్ప ష్టంచేశారు. మళ్లీ పాత వారికే టికెట్లు ఇస్తామని తెలిపారు. ఎన్ని కలకు 10 నెలల సమయమే ఉంది. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలి. మంత్రులు ఎమ్మెల్యేల గెలుపు బాధ్యత తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు కేసీఆర్.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, పార్టీ శ్రేణులంతా ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని పిలుపుచ్చారు.
అయితే, కేసీఆర్ ప్రకటనతో సిట్టింగ్‌లు చాలా హ్యాపీగా ఉన్నారట.. ఇంత కాలం.. మళ్లీ నాకు టికెట్ వస్తుందో..? రాదో..? అనే అనుమానంతో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. కేసీఆర్ మాటలతో ఇక మాకు సీటు గ్యారంటి అనే ధీమాకు వచ్చేశారట.. కానీ, ఇదే సమయంలో.. కొందరు సీనియర్ నేతలు.. తమ నియోజకవర్గాల్లో ఇప్పటికే క్యాడర్‌తో మంచి సంబంధాలు నెరుపుతోన్న ఉన్నవాళ్లు మాత్రం.. ఈ సారి కూడా మాకు సీటు రాదా? అనే ఆవేదనతో ఉన్నారని తెలుస్తోంది.. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు.. టీఆర్ఎస్లో చేరడంతో.. అక్కడ గతంలో టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన వాళ్ల పరిస్థితి ఏంటి..? మళ్లీ తమ స్థానం త్యాగం చేయాల్సిందేనానా? అనే అసహనం వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉందని.. సిట్టింగ్‌లకే సీట్లు వస్తే.. మా విజయం నల్లేరుపై నడకేనంటూ.. కొందరు ప్రతిపక్షాలకు చెందిన నేతలు లెక్కలేసుకుంటున్నారట.. కానీ, ఇది రాజకీయం.. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో..? ఎవరు బరిలోకి దింపుతారో ఊహించలేం.. ఫైనల్‌గా ఎవరిని పోటీకి నిలుపుతారు అనే విషయం మాత్రం.. గులాబీ పార్టీ బాస్కే తెలియాలి.