ఆ వీడియో ఒరిజినల్ కాదు.. బాధితులు ఫిర్యాదు చేస్తేనే ఎంపీ మొబైల్ చెక్ చేస్తాం-అనంతపురం ఎస్పీ

0
1132

ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం కీలక మలుపు తిరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎంపీ మాధవ్ వీడియో ఒరిజినల్ కాదని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటించారు. ఈ వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవో కాదో స్పష్టంగా చెప్పలేమని తెలిపారు. ఎంపీ గోరంట్ల మాధవ్ అభిమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేశామని.. అది ఒరిజినల్ వీడియో కాదని గుర్తించామని వెల్లడించారు. ఒకరు వీడియో చూస్తూంటే.. మరొకరు ఆ వీడియోను ఫోన్‌లో చిత్రీకరించారని… ఆ తర్వాత ఆ వీడియోను అనేక సార్లు ఫార్వార్డ్ చేశారని.. అది ఒరిజినలో కాదో గుర్తించలేకపోతున్నామని వివరించారు. ఈ వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

తొలుత itdp వాట్సాప్ గ్రూపులో ఈ వీడియోను పోస్ట్ చేశారని ఎస్పీ ఫకీరప్ప వెల్లడించారు. యూకే నంబర్‌ నుంచి ఆగస్టు 4న ఈ వీడియో షేర్ అయిందన్నారు. ఈ వీడియోను అప్‌లోడ్ చేసిన వ్యక్తి వివ‌రాల‌ను సేక‌రిస్తున్నామ‌న్నారు. ఒరిజినల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగలమని.. అప్పుడు మాత్రమే నివేదిక వస్తుందని తెలిపారు. ఇప్పటివరకు ఎంపీ వీడియోపై బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. అటు ఎంపీ వీడియోను చెక్ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది కదా అని జర్నలిస్టులు ప్రశ్నించగా.. బాధితులెవరైనా ఫిర్యాదు చేస్తేనే ఎంపీ మొబైల్ చెక్ చేస్తామని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప స్పష్టం చేశారు.

అటు ఈ వీడియో మార్ఫింగ్ అని తాను ఆనాడే చెప్పానని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. ఫేక్‌ వీడియోను క్రియేట్‌ చేసిన వారిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. కొంతమంది దుర్మార్గులు కలిసి చేసిన పని అని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టడానికి ఈ కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు. తన వీడియో వెనక టీడీపీకి చెందిన వంశీ, విజయ్, శివకృష్ణ ఉన్నారని.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గోరంట్ల మాధవ్ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here