ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా ఫ్యాన్ గిర్రున తిరిగిందని, సైకిల్ చక్రాలు ఊడిపోయాయని వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ అన్నారు. చక్రాల్లేని సైకిల్‌ను చంద్రబాబు తొక్కలేకపోతున్నాడని, తన కొడుకుతో తొక్కించలేకపోతున్నాడని, దత్తపుత్రుడిని అరువు తెచ్చుకున్నాడని జగన్ ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో 175కు 175 సీట్లు గెలుస్తామని, ఈ మేరకు కార్యకర్తలు కృషి చేయాలని జగన్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్ కూడా రాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఓటేయడం అంటే సంక్షేమ పథకాలకు వ్యతిరేకమే అని జగన్ అభిప్రాయపడ్డారు.
పెద్దమనిషి చంద్రబాబు హయాంలో బటన్ లేదు.. నొక్కేది లేదు.. నేరుగా దోచుకో.. పంచుకో అన్నట్లు వ్యవహరించారని జగన్ ఆరోపించారు. ఇంత ఈనాడుకు.. ఇంత ఆంధ్రజ్యోతికి, ఇంత టీవీ5కి, ఇంత తన దత్తపుత్రుడికి… ఇక మిగిలిదంతా తనకు అని పంచుకున్నారని విమర్శించారు. తన పాలనకు, చంద్రబాబు పాలనకు తేడా గమనించాలని కోరుతున్నానని జగన్ అన్నారు. గజ దొంగల ముఠాకు ఈ రోజు మంచి పరిపాలనకు మధ్య తేడా గమనించాలని కోరారు. ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు ఎస్సీలను అవహేళన చేశారని.. బీసీల తోకలు కత్తిరిస్తా అంటూ అపహాస్యం చేశారని జగన్ గుర్తుచేశారు. ఆయన హయాంలో ఎస్టీలకు, మైనార్టీలకు కనీసం ఒక్క మంత్రి పదవి కూడా ఇచ్చిన పాపాన పోలేదని మండిపడ్డారు.
తాము తొలిసారిగా శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేశాం. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మనది అని సగర్వంగా తెలియజేస్తున్నా అని జగన్ వ్యాఖ్యానించారు. నేరుగా, లంచాలకు తావులేకుండా, వివక్ష లేకుండా నేరుగా బటన్ నొక్కి ప్రతి అక్కా ప్రతి చెల్లెమ్మకు ప్రతి పేదవాడి పేద కుటుంబానికి అక్షరాల లక్ష 63వేల కోట్ల రూపాయలను ట్రాన్స్‌ఫర్ చేశామన్నారు. ఇందులో దాదాపు 80శాతం ఎస్టీలు, బీసీలు, మైనార్టీ అక్కచెల్లెమ్మలు ఉన్నారన్నారు.