శ్రీకాకుళం జిల్లా పర్యటనలో జగనన్న అమ్మ ఒడి పథకం నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. ఈ మేరకు రూ.6,594 కోట్ల నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆయన వర్చువల్‌గా జమ చేశారు. ఈ పథకం ద్వారా గత మూడేళ్లుగా అక్క చెల్లెమ్మల ఖాతాలలో మొత్తం రూ.19,618 కోట్లను జమ చేశామని సీఎం జగన్ తెలిపారు. 2019–20 విద్యా సంవత్సరంలో 42,33,098 మంది లబ్ధిదారులకు రూ. 6,349.53 కోట్లు, 2020–21 విద్యా సంవత్సరంలో 44,48,865 మంది లబ్ధిదారులకు రూ.6,673 కోట్లు, 2021–22 విద్యా సంవత్సరంలో 43,96,402 మంది లబ్ధిదారులకు రూ. 6,595.00 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించిందని సీఎం జగన్ వివరించారు.
అనంతరం సీఎం జగన్ బహిరంగ సభలో మాట్లాడుతూ.. నాణ్యమైన చదువులు మన రాష్ట్రంలోని ప్రతి ఇంటికి అందాలన్నారు. మనిషి తలరాతను మార్చగలిగే శక్తి చదవుకు మాత్రమే ఉందన్నారు. చదువే నిజమైన ఆస్తి అని పేర్కొన్నారు. చదవుపై పెట్టే ప్రతి రూపాయి కూడా పిల్లల తలరాతను మారుస్తుందని అభిప్రాయపడ్డారు. తొలి విడతలోనే 75 శాతం హాజరు నిబంధన పెట్టడం కరెక్ట్ కాదని అప్పుడు పెట్టలేదని చెప్పారు. రెండో విడతలో కోవిడ్ 75 శాతం నిబంధనకు మినహాయింపు ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొందని వివరించారు. గతేడాది స్కూళ్లు ప్రారంభం అయ్యాక 75 శాతం హాజరు నిబంధన కారణంగా 51 వేల మంది తల్లులకు అమ్మఒడి ఇవ్వలేకపోయామని చెప్పారు. అమ్మఒడికి ఇస్తున్న సొమ్ములో కాస్త నగదును పిల్లలు వెళ్లే స్కూల్స్‌లో టాయిలెట్ మెయింటెనెన్స్, స్కూల్ మెయింటెనెన్స్ కేటాయించేలా కార్యచరణ సిద్ధం చేసినట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఈ మేరకు రూ.2వేలను అక్కచెల్లెమ్మలు ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా, దత్తపుత్రుడుతో జగన్ ఒక్కడే పోరాడుతున్నాడని.. ప్రజల అండ ఉన్నంతవరకు ఎవరూ తన వెంట్రుక కూడా పీకలేరని జగన్ వ్యాఖ్యానించారు.