మరోసారి ప్రధాని మోడీ దగ్గరకు సీఎం జగన్‌..

0
766

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హస్తినకు చేరుకున్నారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. పోలవరం నిధులు, విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా తదితర అంశాలపై ప్రధానికి వినతిపత్రం ఇవ్వనున్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణ పనుల కోసం 2 వేల 900 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. వీటిని కేంద్రం రియంబర్స్‌ చేయాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాల్సి ఉంది. టెక్నికల్‌ అడ్వైజర్‌ కమిటీ నిర్ధారించిన ప్రాజెక్టు వ్యయం 55వేల 548.87 కోట్లకు ఆమోదం తెలపాలని కోరనున్నారు. చేసిన పనులకు 15 రోజుల్లోగా రీయింబర్స్‌ చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్ధించనున్నారు సీఎం జగన్‌.

మరోవైపు, తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన 6,756 కోట్ల రూపాయల బకాయిల అంశాన్ని సైతం సీఎం జగన్.. ప్రధాని మోడీ దగ్గర ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక 8 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న విభజన హామీలను అమలు చేయాలని కోరనున్నారు. ప్రధానికి ఇచ్చే రిప్రజెంటేషన్‌లో ప్రత్యేక హోదా అంశం కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. మెడికల్ కాలేజీలకు అనుమతి, కడప ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయింపు వంటి అంశాలు ప్రధానికి విజ్ఞప్తి చేసే అంశాల్లో ఉండనున్నట్లు సమాచారం. ఇక, భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here