చింతకాయల విజయ్‌పై సీఐడీ వేధింపులు… టీడీపీ ఫైర్

0
634

ఏపీలో సీఐడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కింజరాపు అచ్చెన్నాయుడు. సీఎం జగన్ పెంపుడు చిలకలా ఏపీ సీఐడీ.. తప్పుడు కేసులు, బెదిరింపులు, దాడులే సీఐడీ విధులా..? అని ఆయన ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టు పెడితే తప్పుడు కేసులు.. షేం షేం జగన్. చట్ట బద్దంగా, న్యాయ సూత్రాలకు అనుగుణంగా పని చేయాల్సిన ఏపీ సీఐడీ.. చట్ట వ్యతిరేక వ్యవస్థగా మారిపోతోంది. జగన్ ఆడమన్నట్లు ఆడుతూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు దిగుతోంది.

ఐదేళ్ల పిల్లల్ని కూడా బెదిరించే స్థాయికి దిగజారిపోవడం జగన్ రెడ్డి అరాచక, నియంతృత్వ పోకడలకు నిదర్శనం. టీడీపీ నేత చింతకాయల విజయ్ పై అక్రమ కేసు నమోదు చేయడమే కాకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఇంట్లో బీభత్సం సృష్టించడం దుర్మార్గం. ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పాటైన వ్యవస్థ పౌర హక్కుల్ని కనీసం గౌరవించకపోవడం బాధాకరం అన్నారు. జగన్ మాటలు విని గుడ్డిగా ముందుకు వెళ్తే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు తప్పవనే విషయాన్ని సీఐడీ అధికారులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. గతంలో జగన్ మాటలు విన్న వారంతా ప్రస్తుతం కోర్టు కేసులు, జైళు శిక్షలతో పశ్చాత్తాప పడుతున్నారన్నారు అచ్చెన్నాయుడు.

టీడీపీ నేతలు చేసే సోషల్ మీడియా పోస్టులే టార్గెట్ గా సీఐడీ పోలీసులు కేసులు నమోదుచేస్తున్నారు. విజ‌య్ ఇంటిలో పోలీసులు దురుసుగా వ్యవ‌హ‌రించారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫైర్‌ అయ్యారు. విజ‌య్‌ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ప్రయ‌త్నించార‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌ల‌పై హైకోర్టు ఎన్ని సార్లు మంద‌లించినా జ‌గ‌న్ స‌ర్కారుకు బుద్ధి రావ‌డం లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. మరోవైపు ఏపీలోని సీఐడీ పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఏపీ సీఐడీ రూల్సును అతిక్రమించి ప్రవర్తిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి ఇంట్లో చిన్న పిల్లలు లేరా..?నోటీసులు ఇవ్వకుండా హైదరాబాద్ లోని తన కొడుకు ఇంటికి సీఐడీ అధికారులు ఎలా వస్తారు..? ఏపీ సీఐడీ పోలీసులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. చట్ట ప్రకారం వస్తే ఎవరైనా సహకరిస్తారు. ఏపీలో రాక్షస ప్రభుత్వం నడుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారా? అని ఆయన ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here