గుజరాత్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ఆమ్‌ఆద్మీ పార్టీ… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే టార్గెట్‌గా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాలు రచిస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలతో వరుసగా సమావేశం అవుతున్నారు. విద్యావంతులు, ఆటోడ్రైవర్లు, కర్షకులతో… ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఒకవైపు ఎన్నికల ప్రచారం చేస్తూనే… మరోవైపు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అహ్మదాబాద్ పర్యటనలో ఉన్న కేజ్రీవాల్.. అక్కడి ఆటోరిక్షా డ్రైవర్లతో భేటీ అయ్యారు. అయితే, మీకు పెద్ద అభిమానినంటూ కేజ్రీవాల్‌కు చెప్పారు ఆటోడ్రైవర్ విక్రమ్ దంతానీ. పంజాబ్‌లో ఆటోడ్రైవర్ ఇంటికి భోజనానికి వెళ్లినట్లే… తన ఇంటికి కూడా రావాలంటూ కేజ్రీవాల్‌ను ఆహ్వానించారు.
పంజాబ్‌లో చేసినట్లే గుజరాత్‌లోనూ చేస్తారా ? అని అడిగారు. ఈ ఆహ్వానాన్ని అంగీకరించిన కేజ్రీవాల్… తనతో పాటు మరో ఇద్దరు వస్తారని తెలిపారు. స్వయంగా వచ్చి ఆటోలో తీసుకెళ్లాలని ఆటోవాలాను కోరారు. ఇక, విక్రమ్ దంతానీ ఇంటికి ఆటోలో బయల్దేరిన కేజ్రీవాల్‌ను.. భద్రతా కారణాలతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కేజ్రీవాల్ కలగజేసుకొని వారించడంతో చివరకు అనుమతించారు. ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లిన కేజ్రీవాల్.. అతడితో కలిసి భోజనం చేశారు. భోజనంఎంతో రుచికరంగా ఉందన్న కేజ్రీవాల్… ఆటోవాలా కుటుంబాన్ని ఢిల్లీలోని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. కేజ్రీవాల్ ఆటోలో విక్రమ్ దంతానీకి ఇంటికి వెళుతున్న వీడియోలు, డ్రైవర్ ఇంట్లో భోజనం చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..