పవన్‌ కల్యాణ్‌ విషయం పీఎంవో చూసుకుంటుంది.. మాకు సంబంధం లేదు..!

0
339

మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు రాబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. విశాఖలో రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇక, ప్రధానికి గ్రాండ్‌ వెల్కమ్‌ చెప్పేందుకు సిద్ధం అవుతోంది ఏపీ బీజేపీ.. మరోవైపు.. ప్రధాని మోడీ.. వైజాగ్‌ పర్యటనపై మాట్లాడుతూ.. జనసేన అధినేత పవనల్‌ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు.. విశాఖలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. 11వ తేదీ రాత్రి ప్రధాని విశాఖ చేరుకోగానే రోడ్ షో నిర్వహిస్తాం.. కంచెర్లపాలెం నుండి ఓల్డ్ ఐటీఐ వరకూ కిలోమీటర్‌ మేర ఈ రోడ్‌షో ఉంటుందన్నారు.. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకూ రోడ్ షో జరుగుతుందని.. 11న రాత్రి ఐఎన్‌ఎస్‌ చోళలో ప్రధాని బస చేస్తారని తెలిపారు. 12న 9 ప్రాజెక్టులకు శంఖుస్థాపన చేస్తారు.. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు.. ఇందులో 152 కోట్లతో చేపట్టే విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ ముఖ్యమైంది.. ఇది లక్ష పైన మత్స్యకార కుటుంబాలకు ఒక వరం లాంటిదని పేర్కొన్నారు. కోల్డ్ స్టోరీజీ, ఏసీ ఆక్షన్ హాల్, కొత్త జేటీల నిర్మాణం లాంటివి కూడా ఉన్నాయి.. రాయ్ పూర్-విశాఖ ఎకనామిక్ కారిడార్, విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ , కాన్వెంట్ జంక్షన్ నుండి షీలా నగర్ వరకూ డైరెక్ట్ రోడ్, గైయిల్ ద్వారా శ్రీకాకుళం నుండి ఒడిశాలోని ఒంగుల్ వరకూ పైప్ లైన్ నిర్మాణం, గుంతకల్లులో ఐవోసీఎల్‌ చేపడుతున్న ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చెయ్యడం లాంటివి ఉన్నాయని వెల్లడించారు.

విజయవాడ-నర్సాపూర్-భీమవరం-గుడివాడ-నిడదవోలు రైల్వే లైన్ డెవలప్ చెయ్యడం జరిగింది. దీనిలో 50 శాతం రాష్ట్ర వాటా ఇవ్వాల్సి ఉంది.. కానీ, ఇప్పటి వరకు ఆ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు జీవీఎల్‌ నరసింహారావు.. ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన రైల్వే లైన్స్ అభివృద్ధి నిలిచిపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వక పోవడమేనని ఆరోపించిన ఆయన.. కనీసం పీఎం సమక్షంలోనన్నా సీఎం వైఎస్‌ జగన్‌ వీటికి హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు.. ప్రధాని పర్యటనలో రాజధాని అంశం లేదని స్పష్టం చేశారు జీవీఎల్.. కేవలం కేంద్ర ప్రభుత్వానికి చెందిన అంశాలే ఉంటాయన్న ఆయన.. రైల్వే జోన్‌ను ఇప్పటికే ప్రకటించాం.. త్వరలో దీనిపై నిర్ణయం ఉంటుంది. రైల్వే జోన్ పై ప్రత్యేకంగా వేరే ప్రకటన ఉంటుందన్నారు.. ఇక, ఇది అధికారిక పర్యటన కాబట్టి.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఆహ్వానించడంపై పీఎంవో నిర్ణయం తీసుకుంటుందన్నారు.. కానీ, ప్రధాని విశాఖ పర్యటనను చిన్న చిన్న రాజకీయాల కోణంలో చూడొద్దు… ప్రధాని ఒకటిన్నర రోజు విశాఖలో గడపడం అనేది వైజాగ్ ప్రజలకు ఎంతో గర్వకారణం అన్నారు. విశాఖ అభివృద్ధికి, బీజేపీ బలోపేతం కావడానికి పీఎం టూర్ టేకాఫ్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.. అయితే, ప్రధాని పర్యటన కోసం చిరు వ్యాపారుల షాపులు కట్టేముందు కనీసం నోటీసైనా ఇవ్వాల్సిందన్నారు.. ఈ చర్య సమర్ధనీయం కాదన్నారు.. అసలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యు ఈ పర్యటనలో లేదని స్పష్టం చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు.

మరోవైపు, ప్రధాని మోడీ పర్యటన దృష్ట్యా విశాఖలో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు.. ఆకాశ మార్గంలోనూ ఆంక్షలు విధించారు.. డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించినట్టు పోలీసులు స్పష్టం చేస్తున్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ సభ జరిగే ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి డ్రోన్లు ఎగరవేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు.. నేటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు డ్రోన్లపై నిషేధం అమల్లో ఉంటుందని.. ఉల్లంఘనలకు పాల్పడితే ఎయిర్ క్రాఫ్ట్స్ యాక్ట్ 1934కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్.. ఇక, ప్రధాని మోడీ.. తన పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.. రోడ్ షో నిర్వహించనున్నారు, బహిరంగ సభలో మాట్లాడనున్నారు.. దీంతో భద్రతా ఏర్పాట్లు చాలా పటిష్టంగా కొనసాగుతున్నాయి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బృందాలు విశాఖకు ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.. దీంతో పాటు ప్రధాని పర్యటనకు 5 వేల మందికి పైగా పోలీసులను రంగంలోకి దించారట. ఇక, పీఎం మోడీ, సీఎం జగన్ పర్యటించుకున్న నేపథ్యంలో విశాఖ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. శనివారం ఏయు ఇంజనీరింగ్ మైదానాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక పోలీసు బలగాలు విధులు నిర్వహిస్తున్నాయి. మద్దిలపాలెం ఏయూ గేటు నుంచి వాహనాలు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here