దేశ ప్రజలు అవకాశం ఇస్తే .. దేశమంతా 24గంటల విద్యుత్

0
812

తెలంగాణలో అమలు చేస్తున్నట్టు భారత ప్రజలు అవకాశమిస్తే రెండేండ్లలో బిఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతం 24 గంటల పాటు కరెంటును అందించగలదన్నారు కేసీఆర్. సంవత్సరానికి 25 లక్షల కుటుంబాలకు దళితబంధును అందించగలం. దేశాన్ని నూతన ఆలోచన దిశగా వినూత్న ప్రగతి ఒరవడిని సృష్టించడానికి బిఆర్ఎస్ నడుంకడుతుంది. రాజకీయాల్లో ప్రజలే గెలవాలనే పద్ధతికి బిఆర్ఎస్ ద్వారా శ్రీకారం చుట్టబడాలె. దేశానికి దేశమే సమాన హక్కులతో పరిఢవిల్లబడాలి. పాలనలో నియంతృత్వ ధోరణి పోవాలె. ఫెడరల్ స్ఫూర్తి కొనసాగాలె. స్వయంపాలన విధానం అమలు కావాలె. దళిత, బహుజన, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలె.

వాస్తవాలను ప్రజల్లోకి తీసుకుపోగలిగనం కాబట్టీ తెలంగాణను సాధించుకోగలిగినం. అత్యద్భుతంగా అభివృద్ధి చేసుకోగలిగినం. అదే స్ఫూర్తితో ఈ వాస్తవాలన్నింటిని దేశ ప్రజల ముందుకు తీసుకుపోయి అర్థం చేయించగలిగినప్పుడు ఢిల్లీ ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఆటంకాలను ఎదుర్కొంటూ, అవమానాలను భరిస్తూ ముందుకు సాగుతూ ఎక్కడ మంచి కోసం విప్లవాత్మక కార్యాచరణకు బీజాలు పడతాయో అక్కడ తప్పకుండా విజయం సాధ్యమవుతుంది అనేది చరిత్ర నిరూపించిన సత్యం. బిఆర్ఎస్ అనే వెలుగుదివ్వెను దేశం నలుమూలలకు వ్యాపింపచేద్దాం. తెలంగాణ కీర్తి కిరీటాన్ని భరతమాత పాదాల ముందు పెట్టి దేశ ప్రతిష్టను ద్విగుణీకృతం చేసి భరతమాత సంతృప్తిచెందేలా బిఆర్ఎస్ తో మన ప్రయాణం కొనసాగిద్దాం.

దేశ సౌభాగ్యం కోసం వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న దేశ రైతాంగం కోసం, ఉత్పత్తి కులాల, సబ్బండ వర్గాల సౌభాగ్యం కోసం “అబ్ కీ బార్ కిసాన్ సర్కార్” అనే నినాదంతో బిఆర్ఎస్ ముందుకుపోతుంది. రాబోయే కర్నాటక ఎన్నికల్లో మనం జెడిఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతునిస్తూ ప్రచారంలో పాల్గొంటాం. మన రాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్నాటక ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొని, జెడిఎస్ పార్టీని గెలిపించి కుమారస్వామిని మరోసారి ముఖ్యమంత్రిని చేద్దాం. అందుకు తెలంగాణలో అమలవుతున్న విద్యుత్, వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం తదితర పథకాలను వారికి వివరిద్దాం. గతంలో కర్నాటక పోయినప్పుడు చెప్పినట్టే కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. భగవంతుని కృపతో, మన పట్టుదలతో మరోసారి సీఎం అవుతాడనే విశ్వాసం ఉంది. బిఆర్ఎస్ జాతీయ రాజకీయ ప్రస్థానం కర్నాటకతోనే ప్రారంభం అవుతుంది.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు మనం తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుతో ప్రజల్లోకి పోయి సాధించుకున్నాం. నేడు భారతదేశ అభివృద్ధి గుణాత్మక మార్పు లక్ష్యంగా భారత రాష్ట్ర సమితిగా పరిణామం చెందడం చారిత్రక అవసరం. డిసెంబర్ 14వ తేదీన ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించుకుందాం. అదే రోజు బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. పార్టీ ముఖ్యులంతా 13వ తేదీ సాయంత్రానికి ఢిల్లీ చేరుకోవాలి. మరో రెండు మూడు నెలల్లో మన సొంత బిఆర్ఎస్ భవనం పూర్తవుతుంది. అక్కడి నుంచే పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చు. ఈ సమావేశానికి అతిథులుగా హాజరైన కర్నాటక, మహారాష్ట్ర, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ రైతు సంఘాల నాయకులకు, మేధావులకు పేరుపేరునా ధన్యవాదాలు.

మెట్రో రైల్ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో పాల్గొని తర్వాత నేరుగా తెలంగాణ భవన్ కు సీఎం కేసీఆర్ చేరుకొని, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు.అనంతరం తెలంగాణ భవన్‌లో త్రైలోక్య మోహన గౌరీ అమ్మవారికి సీఎం ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు సీఎంను ఆశీర్వాదించారు. అనంతరం జయజయధ్వానాల మధ్య, బీఆర్ఎస్ పార్టీ గులాబీ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ పూజా కార్యక్రమంలో పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో సీఎం కేసీఆర్ గుమ్మడికాయ కొట్టించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల దివ్య ముహూర్త సమయంలో బీఆర్ఎస్ పార్టీ అధికారిక పత్రాలపై పార్టీ అధినేత సీఎం కేసీఆర్ సంతకాలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here