వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. వారికి మళ్లీ నోటీసులు..

0
1867

సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ ముమ్మరం చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. వివేకా హత్య కేసులో విచారణ ప్రక్రియ ప్రారంభించిన హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు.. ఈ కేసులో ప్రధాన, అనుబంధ ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించింది.. వైఎస్ వివేకా హత్య కేసుకు SC/01/2023 నంబర్‌ కేటాయించింది సీబీఐ స్పెషల్‌ కోర్టు.. ఇక, వైఎస్ వివేకా హత్య కేసులో ఐదుగురు నిందితులకు సమన్లు జారీ చేసింది.. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, వై.సునీల్ యాదవ్, జి.ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరి, డి.శివశంకర్ రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు ఇష్యూ చేసింది.. ఫిబ్రవరి 10వ తేదీన విచారణకు హాజరు కావాలని నిందితులను ఆదేశించింది హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం..

అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల కడప నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు.. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును బదిలీ చేసిన విషయం తెలిసిందే. విచారణ ప్రారంభించిన తొలిరోజే ఐదుగురు నిందితులకు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేయగా.. అందులో సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలు ప్రస్తుతం కడపలోని సెంట్రల్ జైల్‌లో ఉన్నారు.. మరోవైపు ఈ కేసులో ఇవాళ సీబీఐ విచారణకు హాజరుకానున్నారు కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డి.. ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్న ఆయన.. లోటస్‌పాండ్‌లో వైఎస్‌ విజయమ్మను కలిసారు.. ఇక, మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు అవినాష్‌రెడ్డి.. ఆయనకు సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చింది సీబీఐ. మొత్తంగా.. వైఎస్‌ వివేకా కేసులో తొలిరోజు నుంచే సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ ముమ్మరం చేసింది. ఏపీలో విచారణ సమయంలో అనేక ఆరోపణలు రాగా.. కేసు విచారణ హైదరాబాద్‌ బదిలీ అయిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here