జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం.. నేను తలుచుకుంటే కడప జిల్లాకు వైఎస్ఆర్ పేరు ఉండేదా?

0
1021

ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ ఎలా పుట్టారో.. ఏ లగ్నంలో పుట్టారో కానీ.. నోరెత్తితే అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. అసెంబ్లీ అంటే అందరూ బాధ్యతగా ఉండేవాళ్లు అని.. కానీ పోలవరం, అమరావతి, నాడు-నేడు, వ్యవసాయం అన్ని విషయాల్లో జగన్ అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు ఎలా మారుస్తారని ప్రశ్నించారు. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్‌ అని.. ఆయన పేరు మార్చి.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని జగన్‌ దెబ్బతీస్తున్నారని విమర్శించారు. మెడికల్‌ యూనివర్సిటీ పెట్టింది ఎన్టీఆర్‌ అని.. మెడికల్‌ ఎడ్యుకేషన్‌కు ప్రాముఖ్యతనిచ్చింది తాను అని వివరించారు. తాను తలుచుకుంటే కడపకు వైఎస్ఆర్ పేరు ఉండేదా అని, హర్టికల్చర్‌ యూనివర్శిటీకి వైఎస్ఆర్ పేరు ఉండేదా అని ప్రశ్నించారు. పేరు మార్చడం వల్ల జగన్‌ తన నీచ బుద్ది బయటపెట్టుకున్నారని.. పేర్లు మార్చడం తనకు చేతకాదా..? జగనే పెద్ద మొగాడా అని చురకలు అంటించారు.

చేత కాని దద్దమ్మ పనులు చేస్తున్న జగన్‌‌కు తనకు విమర్శించే హక్కు లేదన్నారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ పెట్టి తన తండ్రి పెట్టుకోవచ్చు అని.. ఓ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కట్టి.. వైఎస్ఆర్ పేరు పెట్టుకుంటే తనకేం బాధ లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తట్టమట్టి కూడా వేయని నువ్వు పేరు తీస్తావా స్టిక్కర్ సీఎం అంటూ ఎద్దేవా చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తాం.. అధికారంలోకి వచ్చాక జగన్‌ కథ చెబుతానని హెచ్చరించారు. తాను కాంగ్రెస్‌ నేతల పేర్లు కూడా పెట్టానని.. వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, కృష్ణకాంత్‌ పేర్లను పెట్టినట్లు గుర్తుచేశారు. జగన్‌ పిచ్చి తుగ్లక్‌గా చరిత్రలో మిగిలిపోతారన్నారు. టీడీపీకి వెన్నెముక బీసీలే అని.. టీడీపీ వచ్చాక బీసీల్లో నాయకత్వం పెరిగిందని తెలిపారు.

టీడీపీ బీసీలకు రుణపడి ఉంటుందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు చేసింది టీడీపీనే అన్నారు. జగన్‌ వచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి కుదించారని ఆరోపించారు. జగన్ చర్యల వల్ల.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సుమారు 16,800 మంది బీసీ నేతలకు అధికారం దూరమైందన్నారు. బీసీకి చెందిన ఎర్రన్నాయుడుకు కేంద్ర కెబినెట్‌లో అవకాశం కల్పించామని.. గత ఎన్నికల్లో కొద్దిమంది బీసీలు పక్క పార్టీకి వెళ్లారని.. అయితే ఈ మూడున్నరేళ్ల కాలంలో జగన్‌ పాలన చూసిన బీసీలు తిరిగి టీడీపీకి వచ్చేస్తారనే నమ్మకం ఉందన్నారు. జగన్‌ బీసీల కోసం 56 కార్పొరేషన్లు పెట్టారని.. కానీ ఒక్క లోన్‌ అయినా ఇచ్చారా అని చంద్రబాబు నిలదీశారు. జగన్‌ హయాంలో 56 బీసీ కులాల కార్పొరేషన్ల ఛైర్మన్‌లు తమ కొద్దీ పదవి అనే స్థాయికి వచ్చారన్నారు. బీసీ కులాల కార్పొరేషన్‌ల ఛైర్మన్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రజాధనం జగన్‌ జేబుల్లోకి వెళ్తోందన్నారని.. ప్రతి సాయంత్రం తాడేపల్లిలో కూర్చొని జగన్‌ తన గల్లా పెట్టెను చూసుకుంటున్నారని.. ఏదోక రోజు జగన్‌ పొట్ట పగలడం ఖాయమని.. అప్పుడు ఆ డబ్బులు బయటకొస్తాయని.. రాష్ట్రాన్ని పాలించడం చేతకాక జగన్‌ త్వరలోనే కాడి పడేస్తాడని ప్రచారం జరుగుతోందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. జగన్‌కు పిరికితనం వచ్చిందని.. దుప్పటి కప్పుకోకుండా జగన్‌ పడుకోలేకపోతున్నాడని.. అసెంబ్లీలో జగన్‌ అసహనంతో కన్పిస్తున్నారని.. అచ్చెన్న పులిలా పోరాడుతున్నాడని చెప్పారు.

వైసీపీ ఎమ్మెల్యేలు పిల్లులు మాదిరి మ్యావ్‌ మ్యావ్‌ అంటూ తిరగుతున్నారని.. తాను యువతకు ఐటీ ఉద్యోగాలు వచ్చేలా కృషి చేశానని.. జగన్‌ వచ్చాక యువతకు వాలంటీర్లు, చేపలు పట్టడం.. మద్యం దుకాణాల్లో ఉద్యోగాలిస్తున్నారని చంద్రబాబు విమర్శలు చేశారు. ఏపీకి పరిశ్రమలు ఇప్పట్లో రావు అన్నారు. ఉపాధి, ఉద్యోగాలు వచ్చే అవకాశం రాదన్నారు. విశాఖ ఐటీ హబ్‌, రాయలసీమను హర్డ్‌ వేర్‌ హబ్‌ చేయాలనుకున్నామని.. జగన్‌ వచ్చి సౌతాఫ్రికా, శ్రీలంకలా చేస్తానంటున్నారన్నారు. పిల్లల భవిష్యత్‌ కోసం టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. జగన్‌ వచ్చాక విధ్వంసక పాలన చేస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలే తన కులం.. బీసీలకు తానే ప్రతినిధిని అని పేర్కొన్నారు. పేదవాడే తన కులస్తుడు అని.. టీడీపీ సంపద సృష్టిస్తోంటే.. జగన్‌ ఆ సంపదను కొల్లగొడుతున్నాడన్నారు. రాబోయే రోజుల్లో బీసీల రుణం తీర్చుకుంటానన్నారు. వైసీపీ రాష్ట్రానికి చీడపురుగు అన్నారు. 142 బీసీ కులాల నుంచి నాయకత్వం పెంచుతామన్నారు. టీడీపీ ఏర్పాటు చేసిన బీసీ సాధికారిత సమితి బీసీ సమస్యలపై అధ్యయనం చేస్తుందన్నారు. మేనిఫెస్టోలో ఏయే అంశాలు పెట్టాలో బీసీ సాధికారిత సమితినే సూచిస్తుంది.

త్వరలోనే జయహో బీసీ భేరీ నిర్వహిస్తామని.. ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తామని చంద్రబాబు వెల్లడించారు. అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో అంశాలు అమలు చేస్తామన్నారు. కమలహాసన్‌ను మించిన నటుడు జగన్‌ అని.. నాటకాలు బాగా వేస్తాడని ఆరోపించారు. అసెంబ్లీలో నంగి నంగిగా మాట్లాడతాడని.. చూసే వారికి నోట్లో వేలు పెట్టినా కొరకలేడనే రీతిలో జగన్‌ కలర్‌ ఇస్తాడని మండిపడ్డారు. జగన్‌ ప్రభుత్వంలో అందరికిచ్చే పథకాలే బీసీలకు ఇచ్చారు.. కానీ ప్రత్యేకంగా బీసీలకు ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. టీడీపీ బీసీ సబ్‌ ప్లాన్‌ పక్కన పెట్టేశారన్నారు. బీసీల కోసం ప్రత్యేకంగా ఒక్క రూపాయైనా ఖర్చు పెట్టారా అని నిలదీశారు. ఆదరణ పనిముట్లు గోడౌన్‌లలో పెడతారా అని.. లెటర్‌ ఇచ్చినందుకే అచ్చెన్నను 84 రోజులు జగన్‌ జైల్లో పెట్టించారన్నారు. బాబాయ్‌పై గొడ్డలి పోటు వేసినందుకు జగన్‌ను ఎన్ని రోజులు జైల్లో పెట్టాలని.. నిర్మాణ రంగంలో అందరూ బీసీలే ఉన్నారని.. ఆ రంగాన్ని భ్రష్టు పట్టించారని చంద్రబాబు మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here