ఏపీ విద్యారంగం దశ దిశ మార్చాం.. సీఎం జగన్

0
655

ఏపీలో విద్యా రంగం విషయానికొస్తే బడికెళ్లడం, చదువుకోవడం అన్నది చిన్నారుల హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని నీతి ఆయోగ్ సమావేశంలో వివరించారు ఏపీ సీఎం జగన్. దీన్ని సుస్థిర ప్రగతి క్ష్యాలతో అనుసంధానం చేశాం. స్కూళ్లుమానేసే విద్యార్థుల శాతాన్ని పూర్తిగా నివారించడంతోపాటు జీఈఆర్‌ నిష్పత్తిని పెంచేందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రాథమిక విద్యలో దేశ జీఈఆర్‌ నిష్పత్తి 99.21 శాతంకాగా, ఏపీలో ఇది 84.48 కావడం విచారకరం. 2018లో కేంద్ర విద్యాశాఖ విడుదలచేసిన గణాంకాల్లో విద్యారంగంలో రాష్ట్రం పనితీరు అత్యంత దారుణంగా ఉందని వెల్లడైంది. అందుకే విద్యారంగంలో కీలక అంశాలపై దృష్టిపెడుతూ సమర్థవంతమైన విధానాలను తీసుకు వచ్చాం అన్నారు.

తల్లిదండ్రుల పేదరికం పిల్లల చదువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డంకాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమ్మ ఒడి అనే పథకాన్ని అమలు చేస్తోంది. పిల్లలను బడికి పంపిస్తే చాలు, ఏటా రూ.15వేల రూపాయల చొప్పున పిల్లల తల్లులకు అందిస్తోంది. 75శాతం హాజరు ఉండాలనే నిబంధనను కూడా పరిగణలోకి తీసుకున్నాం. అంతేకాదు పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు తీసుకు వచ్చాం. విద్యాకానుక ద్వారా స్కూలు బ్యాగులు, బై లింగువల్‌ టెక్ట్స్‌బుక్స్, నోట్‌ పుస్తకాలు, షూ, 3 జతల యూనిఫారం, ఇంగ్లిషు టు తెలుగు డిక్షనరీలు ఇస్తున్నాం. పిల్లలకు మరింత నాణ్యతతో బోధన అందించడానికి నాణ్యమైన పాఠ్యాంశాలతో ఉన్న బైజూస్‌ యాప్‌కూడా అందిస్తున్నాం. 8 వ తరగతి విదార్థులకు ట్యాబ్‌ కూడా ఇవ్వబోతున్నాం.

పిల్లలు మంచి వాతావరణంలో విజ్ఞానాన్ని సముపార్జించడానికి మన బడి నాడు – నేడు కింద 55,555 స్కూళ్లలో రూ.17,900 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. నీటి సదుపాయం ఉన్న టాయిలెట్లు, పరిశుభ్రమైన తాగునీరు, పెయింటింగ్, విద్యుద్దీకరణ, ఫ్యాన్లు, ట్యూబులైట్లు, పిల్లలకు, టీచర్లకు ఫర్నిచర్, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, ఇంగ్లిషు ల్యాబ్, కాంపౌండ్‌ వాల్, కిచెన్‌ షెడ్, అదనపు తరగతి గదులు, డిజిటల్‌ క్లాస్‌రూమ్స్, కావాల్సిన మరమ్మతులు అన్నీ చేపడుతున్నాం. మొత్తం మూడు విడతల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేస్తాం. మొదటి విడత కింద ఇప్పటికే 15,715 స్కూళ్లను తీర్చిదిద్దాం. ఇందులో డిజిటల్‌ తరగతుల ఏర్పాటు కూడా పూర్తిచేస్తాం అని వెల్లడించారు జగన్.

ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషు భాషకున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని పిల్లలకు చక్కటి పునాది వేసే కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ప్రపంచస్థాయి పోటీని ఎదుర్కొనేలా పిల్లలను తీర్చిదిద్దడానికి అన్ని స్కూళ్లను మ్యాపింగ్‌ చేసి సబ్జెక్టు వారీగా టీచర్లను 3వ తరగతి నుంచే అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఉన్నత విద్యా స్థాయిలో కూడా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. కేవలం విద్య ద్వారానే పేదిరికం నుంచి బయటపడతారని గట్టిగా విశ్వసిస్తూ విద్యాదీవెన పథకం ద్వారా 100శాతం ఫీజు రియింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నాం. గత మూడేళ్లలో 21.56 లక్షల మంది విద్యార్థులు దీనిద్వారా లబ్ధిపొందారు. విద్యార్థులు భోజనం, హాస్టల్‌ ఖర్చుకోసం వసతి దీవెన అమలు చేస్తున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here