తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) చరిత్ర ఇక ముగిసింది.. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన ఆ పార్టీని.. రాష్ట్రం కల సహకారం అయిన తర్వాత రాజకీయ పార్టీగా మార్చారు కేసీఆర్.. ఇక, దేశవ్యాప్తంగా పోటీ చేసేందుకు సిద్ధమైన కేసీఆర్.. టీఆర్ఎస్ను కాస్తా భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మార్చేశారు.. తెలంగాణ భవన్ వేదికగా జరిగిన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో.. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టడం.. ప్రతినిధులు దానికి ఆమోదం తెలపడం జరిగిపోయాయి.. ఇక, ఈ సందర్భంగా చేసిన తీర్మానాన్ని.. సమావేశం చివరల్లో చదివి వినిపించారు గులాబీ పార్టీ చీఫ్ కె.చంద్రశేఖర్ రావు.. భారత్ రాష్ట్ర సమితిగా జాతీయ పార్టీని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అక్టోబర్ 5వ తేదీ 2022న హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరిగింది… టీఆర్ఎస్ పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి పార్టీగా మారుస్తూ ఏకగీవ్రంగా తీర్మానం చేసింది… ఇక, బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తుంది అంటూ చేసిన తీర్మానాన్ని చదివి వినిపించారు.. ఇక, ఆ తీర్మానంపై సంతకం చేశారు కేసీఆర్.. పలు రాష్ట్రాల నేతల సమక్షంలో ఈ ప్రకటన చేశారు కేసీఆర్.
మరోవైపు.. ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యిందని ఆరోపణలు గుప్పించిన ఆయన.. తెలంగాణ మోడల్ దేశంలో అమలు కావాలని పిలుపునిచ్చారు.. బంగ్లాదేశ్ కంటే భారత్ వెనకపడటం ఎంటి ? అని ప్రశ్నించారు.. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జైత్రయాత్రను మహారాష్ట్ర నుంచి మొదలు పెడదామని వ్యాఖ్యానించారు.. కర్ణాటకలో మన జెండా ఎగరాలి.. అఖిలేష్ యాదవ్ ఈ సమావేశానికి రావొద్దని చెప్పాం.. ఎందుకంటే వాళ్ల నాన్న ములాయం సింగ్ ఐసీయూలో ఉన్నారని తెలిపారు.. అందరూ కలిసి వస్తారు.. బీఆర్ఎస్ సత్తా చాటుతుందన్నారు కేసీఆర్. ఈ సమావేశంలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో పాటు.. మరికొన్ని రాష్ట్రాల నుంచి నేతలు హాజరైన విషయం తెలిసిందే… ఇక, బీఆర్ఎస్ ప్రకటనను గులాబీ పార్టీ శ్రేణులు స్వాగతించాయి.. హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బాణాసంచా కాల్చాయి ఆ పార్టీ శ్రేణులు.