వైఎస్సార్సీపీ మూడో ప్లీనరీ రెండో రోజు ముగింపు ప్రసంగాన్ని పార్టీ శాశ్వత అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దాదాపు రెండు గంటలపాటు సుదీర్ఘంగా కొనసాగించారు. జగన్ స్పీచ్ సభికులను, టీవీ వీక్షకులను, ఇతర శ్రోతలను ఆకట్టుకుంది. మీటింగ్‌కి ప్రత్యక్షంగా హాజరైనవారు ఆయన మాట్లాడుతున్నంతసేపూ హర్షధ్వానాలతో ప్లీనరీ ప్రాంగణం మొత్తాన్ని హోరెత్తించారు. దీంతో జగనన్న కూడా రెట్టించిన ఉత్సాహంతో స్వరం పెంచి ప్రసంగించారు. మొదట్లో కొద్దిసేపు స్పీకర్ సరిగా పనిచేయకపోవటంతో, మాట కట్ అయినట్లు వినిపించటంతో తల పక్కకు తిప్పి నిర్వాహకుల వైపు కాస్త అసహనంగా చూసినట్లు అనిపించింది.
ఆ తర్వాత స్పీచ్ ముగిసే వరకు ఇక స్పీకర్ సమస్య తలెత్తలేదు. జగన్ తన ప్రసంగంలో ఎక్కువగా అక్కచెల్లెమ్మలు అనే పదాన్ని ప్రస్తావించారు. ప్రతి అన్నకూ, ప్రతి తమ్ముడికీ, ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ అనే పదాలనూ ఉచ్ఛరించారు. అదే సమయంలో దుష్టచతుష్టయం అనేదాన్నీ పలుమార్లు నొక్కి చెప్పారు. వైఎస్సార్సీపీ మీ పార్టీ, మన పార్టీ అని చెప్పటం మంచిగా అనిపించింది. “ఈటీవీ మీటీవీ”లాగా ”ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం” అని జగన్ పదేపదే అనటం అందర్నీ టచ్ చేసింది. ‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ అనే ఎన్నికల నినాదాన్ని నిన్న మరోసారి పలికిప్పుడు కరతాళ ధ్వనులు మారుమోగాయి.
విపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా నా గుండె ధైర్యం మీరే అని జగన్ ప్రజలనుద్దేశించి అన్నప్పుడూ ఆ ప్రాంతమంతా నినాదాలతో దద్దరిల్లింది. ఇలా ఆయన ప్రసంగం ఆద్యంతం ఆసక్తిగా ముగిసింది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ స్పీచ్‌లో ఎక్కువసేపు పేపర్ చూసి మాట్లాడారు. కొద్దిసేపు పేపర్ చూడకుండానే ప్రసంగం కొనసాగించారు. ఇలా పేపర్ వైపు చూడకుండా ప్రజల వైపు చూస్తూ స్పీచ్ ఇచ్చినప్పుడే బాగనిపించింది. జగనన్న తన ప్రసంగం మొత్తాన్ని పేపర్ చూడకుండానే కొనసాగిస్తే బాగుండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే వైఎస్సార్సీపీ అంటే జగన్. జగన్ అంటే వైఎస్సార్సీపీ. ఈ పార్టీ ఆయనతోనే ప్రారంభమైంది. అతడే ఒక సైన్యంలా ఎదిగింది. జగన్ ఒకటికి పది సార్లు చెప్పినట్లు దేవుడి దీవెనలతో, ప్రజల చల్లని చూపులతో అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీని సొంతం చేసుకొని అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కొడుకూ సాధించని ఫీట్‌ని జగన్ అందుకున్నాడు. సొంతగా పార్టీ పెట్టి సోనియాగాంధీ అనే బలమైన శక్తిని, చంద్రబాబు అనే అనుభవజ్ఞుడిని ఒంటరిగా ఢీకొని నిలబడ్డారు.
ముఖ్యమంత్రిగా ముచ్చటగా మూడేళ్లు పూర్తిచేసుకున్నారు. పార్టీపరంగా, ప్రభుత్వపరంగా ఈ గొప్ప ప్రస్థానం జగన్‌కి కొట్టిన పిండే. ఒక రకంగా చెప్పాలంటే ఆయన తన ప్రొఫైల్‌ని తానే గుర్తుచేసుకోవటం. ప్రసంగాన్ని త్వరగా ముగించాలనే ఒత్తిడేమీ ఆయన పైన ఉండదు. అందువల్ల పేపర్ చూడకుండా, అవలీలగా, అనర్గళంగా ప్రసంగించాల్సింది. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు కాబట్టి వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల కింద ప్రజలకు ఇచ్చిన నిధుల గణాంకాల జోలికి వెళ్లకుండా ఉండే బోర్ కొట్టకుండా ఉండేది.