సెప్టెంబర్‌ నుంచి విశాఖలోనే ఉంటా.. జగన్‌ కీలక ప్రకటన

0
70

శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. రాజధానిపై కీలక ప్రకటన చేశారు.. సంతబొమ్మాళి మండలం నౌపాడలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ నుంచి విశాఖలోనే ఉంటా.. కాపురం కూడా విశాఖకు మారుతున్నాను.. అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖ అంటూ వ్యాఖ్యానించారు.. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా విశాఖలోనే బస చేస్తాను.. ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే అన్ని జిల్లాలు అభివృద్ధి చేస్తున్నాం అన్నారు సీఎం జగన్‌.. ఇక, ఉద్దానం కిడ్నీ సమస్యల పరిష్కారంగా 700 కోట్ల రూపాయలతో మంచినీటి పథకం చేపట్టాం.. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను జూన్ నెలలోపు పూర్తి చేస్తాం.. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా ట్రైబల్ ఇంజనీరింగ్ కడుతున్నాం. నాలుగు మెడికల్ కళాశాలలు నడుపుతున్నాం అని ప్రకటించారు. మే 3 వ తేదీన భోగాపురం విమానాశ్రయంకు శంకుస్థాపన చేస్తాం.. మే 3వ తేదీన అదానీ డేటా సెంటర్ ప్రారంభిస్తున్నాం.. గతంలో ఎప్పుడైనా ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద ఇంతలా దృష్టిపెట్టింది లేదన్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

ఇక, సంతబొమ్మాళి మండలం నౌపాడలో గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్వాసితులకై 34.98 కోట్ల రూపాయలతో మూలపేట ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం.. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో రూ. 365,81 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.. రూ. 176.35 కోట్ల రూపాయలతో బిఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు (గొట్టా బ్యారేజ్)- హిరమండలం ఎత్తిపోతల పథకం నిర్మాణపనులకు శంకుస్థాపన చేశారు. అన్ని అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, జిల్లా ఇన్ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్, జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు, రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావు, పశుసంవర్ధక పాడిపరిశ్రమ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తదితర నేతలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here