మరోసారి గొప్పమనస్సు చాటుకున్న సీఎం జగన్..

0
141

మరోసారి మనవత్వం చాటుకున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. ఆపదంటూ తన వద్దకు వచ్చేవారిని అక్కున చేర్చుకుని.. ఆదుకునే సీఎం.. ఇవాళ ఐదుగురికి సాయం అందించారు. పల్నాడు జిల్లా చిలకలూరి పేట పర్యటనకు ఫ్యామిలీ డాక్టర్ విధానం కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర ముఖ్య మంత్రి దృష్టికి ఐదుగురు బాధితులు తమ అనారోగ్య సమస్యలు పరిష్కరించాలని కోరితూ, ఆర్ధిక సహకారం, ఉపాధి అవకాశాలను కల్పించాలని వేడుకున్నారు. దీనిపై స్పందించిన సీఎం.. వారిని తక్షణం ఆదుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటిని ఆదేశించారు. ఇక, సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ బాధితులను జిల్లా కలెక్టరేట్ కు పిలిపించి మాట్లాడారు. బాధితులకు తక్షణ సాయంగా ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున ఐదుగురికి ఐదు లక్షల రూపాయల ఆర్ధిక సాయం చేశారు.. సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ బాధితులను కలెక్టరేట్ కు పిలిపించి బాధితుల అనారోగ్య కారణాలు, పడుతున్న ఆర్ధిక ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వారికి ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి ఆర్ధిక సహకారం అందిస్తూనే అవసరమైన వైద్య సేవలు పొందేందుకు తగిన సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ వెల్ల డించారు.

బాధితుల్లో చిలకలూరి పేట నియోజక వర్గం, కనపర్రు గ్రామానికి చెందిన తన్నీరు ఓర్సు ఉమాదేవి తాత వెంకయ్య తన మనవరాలు పుట్టుకతోనే గుండెకు రంధ్రంతో అన్నం తినే సమయంలో అన్నవాహికకు అడ్డం పడుతుందని వాపోయారు. తమకు ఎటువంటి స్థిర,చర ఆస్తులు లేవని,ఉన్న దాంట్లో ఇప్పటి వరకు సుమారు 10 లక్షల వరకు ఖర్చు చేశామని తెలిపారు. ఏడాదికి సుమారు రూ.24 లక్షలు ఖర్చు అవుతుందని అందించమని వేడుకొనగా తక్షణ సాయం కింద బాధితులకు 1 లక్ష రూపాయలు ఆర్ధిక సాయాన్ని జిల్లా కలెక్టర్ అందించారు. ఇక, చిలకలూరిపేట నియోజక వర్గం, ఏలూరు కు చెందిన పటాన్ మహబూబ్ సుభాని తనకు చిన్నప్పటి నుంచి సోరియాసిస్ అనే దీర్ఘకాలిక అనారోగ్య సమస్య తో బాధ పడుతున్నట్లు ముఖ్యమంత్రి కి తెలిపారు. తనకున్నసమస్యను పరిష్కరించడం తో పాటు కుటుంబ జీవన విధానం బాగు పడేందుకు తగిన ఉపాధి చూపించాలని ముఖ్య మంత్రికి విన్నవించారని, సి.ఎం. ఆదేశాల మేరకు ఆర్ధిక సాయం కింద బాధితునికి జిల్లా కలెక్టర్ 1 లక్ష సాయం అందజేశారు.

మరోవైపు.. చిలకలూరిపేట 18వ వార్డుకు చెందిన అనురాధ, వెంకటేష్ దంపతులకు ఏడాదిన్నర పాప (అంకమ్మ యోక్షిత సాయి) ఉందని, పాప పుట్టినప్పటి నుండి కాలేయ వ్యాధితో ఇబ్బంది పడుతూ ఉందని ముఖ్య మంత్రి ముందు వాపోయారు. పాపను పలు ఆస్పత్రులలో చికిత్సలు అందించినప్పటికీ, హైదరాబాదులోని గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పటల్ నందు సమస్య నయమవుతుందని చెప్పడంతో అక్కడికి వెళ్లి పాపకు వైద్యం చేపించామని, కాలేయ మార్పిడి ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని, ఇందుకోసం లక్షల్లో చికిత్సకు ఖర్చవుతుందని తెలియజేయడంతో బాధితులు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆశ్రయించి వేడుకోవడంతో వారికి సీఎం వైద్య చికిత్స చేయించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. బాధితులకు తక్షణ వైద్య సాయం కింద ఖర్చుల నిమిత్తం 1 లక్ష ఆర్ధిక సాయం చేశారు. ఇక, నరసరావు పేట కు చెందిన సమీన్ పర్వానా అనే మహిళ తన ఏడేళ్ళ సుభాని అనే బాలునికి జ్వరం రావడం తో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి వైద్య చికిత్స నిమిత్తం తీసుకు వెళ్ళానని, ఆ డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకోవడం వలన తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యాడని అక్కడినుంచి విజయవాడ, హైదరాబాద్ వంటి అనేక ప్రముఖ వైద్య శాలలకు తీసుకు వెళ్ళినా నయం కాకపోగా ఐ.సీ,యూ లో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడని ఆదుకోవాలని ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డిని వేడుకున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. దీంతో ముఖ్య మంత్రి స్పందించిన మేరకు 1 లక్ష రూపాయలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు.

ఇక, కుంభగిరి పేరెడ్డి డిసెంబరు 30 వ తేదిన ద్విచక్ర వాహనం పై ప్రయాణం చేస్తున్న సమయంలో కుక్క అడ్డం రావడంతో అదుపుతప్పి కింద పడిపోయానని ముఖ్యమంత్రి కి విన్నవించుకున్నారు. ఆరోగ్యం మెరుగు పడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని వాపోయారు.ఎంత వైద్య చికిత్స చేయించుకున్నా తలకు, పొట్టకు తీవ్ర గాయం అయ్యి కోలుకోలేక పోతున్నానని ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నానని ఆదుకోవాలని వేడుకున్నారు. దీంతో స్పందించిన ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మెరుగైన వైద్య సేవలను అందిస్తామని భరోసా కల్పించారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు తక్షణ సాయంగా జిల్లా కలెక్టర్ బాధితునికి 1 లక్ష ఆర్ధిక సాయం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here