ఆర్-5 జోన్‌ ఇళ్ల నిర్మాణానికి కసరత్తు.. ఎల్లుండి సీఎం శంకుస్థాపన

0
130

అమరావతిలో ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 24న సీఎం వైఎస్ జగన్.. ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు శాంక్షన్ పత్రాలను కూడా అందించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఈ రోజు ఆ ఏర్పాట్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు జోగి రమేష్‌, నాగార్జున తదితరులు పరిశీలించారు.. దీని కోసం ఈ నెల 24న సీఎం వైఎస్‌ జగన్‌ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు.. సీఆర్డీఏ పరిధిలో (కృష్ణాయపాలెం జగనన్న లే అవుట్‌) పేదల ఇళ్ళ నిర్మాణాలకు శంకుస్ధాపన చేయనున్నారు సీఎం జగన్‌.. 24న ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. కృష్ణాయపాలెం హౌసింగ్‌ లే అవుట్‌కు చేరుకుని వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు.. అనంతరం ఇళ్ళ నిర్మాణ శంకుస్ధాపన చేస్తారు.. మోడల్‌ హౌస్‌ను పరిశీలిస్తారు.. అనంతరం వెంకటపాలెం చేరుకుని లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాల పంపిణీ చేస్తారు.. ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

మరోవైపు.. ఆర్‌ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని రాజధానికి భూములిచ్చిన రైతులు వ్యతిరేకిస్తున్న విషయం విదితమే కాగా.. ఆర్‌-5 జోన్‌లో పేదలకు ఇళ్లు నిర్మించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.. ఇక, హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత.. శుక్రవారం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. జులై 24న పేదల ఇళ్లకు శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతుండగా.. ఈ ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టును కోరారు.. అయితే, హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచడంతో ఎల్లుండి.. శంకుస్థాపన కార్యక్రమంపై ఉత్కంఠ సాగుతోంది.. హైకోర్టు తీర్పు ఎలా వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here