దేవికను రక్షించిన ఎన్టీఆర్… అందుకే అంత అభిమానం

0
85

సినిమా అంటే రంగుల ప్రపంచం. అందునా హీరో, హీరోయిన్లు ప్రత్యేక అభిమానం ఒకరిపట్ల ఒకరు చూపిస్తుంటారు. దేవిక-ఎన్టీఆర్ ల మధ్య ఏదో ఉందని అప్పట్లో భావించేవారు. సినిమా రంగంలో పుకార్లు షికారు చేయడమన్నది ఇప్పుడే కాదు, అప్పట్లోనూ ఉండేది. యన్టీఆర్ హిట్ పెయిర్స్ తో ఆయనకు ‘రిలేషన్ షిప్’ఉన్నట్టు ‘కాగడా’ వంటి పత్రికలు ప్రచారం చేసేవి. యన్టీఆర్ హిట్ పెయిర్స్ లో ఒకరిగా నిలచిన దేవికను సైతం అదే తీరున చాటింపు వేశారు. ఆ చాటింపు ఎలా ఉన్నా తెలుగునాట యన్టీఆర్ – దేవిక జంట భలేగా అలరించింది. యన్టీఆర్ చిత్రాలతోనే దేవిక గుర్తింపు సంపాదించడం విశేషం! దేవిక అసలు పేరు ప్రమీలాదేవి. ఆ పేరుతో ఓ సినిమాలో తళుక్కుమన్నా, తరువాత యన్టీఆర్,అంజలీదేవి జంటగా నటించిన ‘రేచుక్క’లో ప్రమీల పేరుతో రాకుమారి లలితాదేవిగా కనిపించారు. ఆ సినిమా తరువాత యన్టీఆర్ ‘శభాష్ రాముడు’లో ఆయనకు నాయికగా నటించి, అలరించారు. ఆ సినిమాతోనే దేవికకు నటిగా మంచిపేరు లభించింది.

యన్టీఆర్ సరసన దేవిక నటించిన “శభాష్ రాముడు, రక్తసంబంధం, మహామంత్రి తిమ్మరుసు,శ్రీకృష్ణావతారం, శ్రీకృష్ణసత్య, శ్రీకృష్ణవిజయం, పెండ్లిపిలుపు, కంచుకోట, టాక్సీ రాముడు, గాలిమేడలు, దక్షయజ్ఞం, దేశద్రోహులు, ఆడబ్రతుకు, మంగళసూత్రం, భామావిజయం, నిండుమనసులు, గండికోట రహస్యం, నిలువుదోపిడి, రాజకోట రహస్యం, చిన్ననాటి స్నేహితులు” వంటి చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. వీటిలో “శభాష్ రాముడు, రక్తసంబంధం, ఆడబ్రతుకు, శ్రీకృష్ణావతారం” చిత్రాలు రజతోత్సవాలు చూశాయి. యన్టీఆర్ శ్రీకృష్ణునిగా పాతిక చిత్రాలలో దర్శనమిచ్చారు. ఆయన సరసన రుక్మిణిగా పలుమార్లు కనిపించారు దేవిక. ఇక యన్టీఆర్ సొంత చిత్రాలలోనూ, ఆయన దర్శకత్వంలోనూ దేవిక నటించారు. “తల్లాపెళ్ళామా, శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర” వంటి యన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన సినిమాల్లో ఆమె అభినయించారు. అందువల్ల యన్టీఆర్, దేవికపై ఆ రోజుల్లో కొందరు పుకార్లు షికారు చేసేలా రాతలు రాశారు. అయితే వారిద్దరూ అవేవీ పట్టించుకోకుండానే తమ నటనావృత్తిలో విజయయాత్ర చేశారు. ఇలాగే దేవికను ఓ సారి “మీకు రామారావుతో ఎలాంటి అనుబంధం ఉండేది?” అంటూ ప్రశ్నించారు ఓ పత్రికాప్రతినిధి. అందుకు ఆమె ఏ మాత్రం తడుముకోకుండా, “మీ ప్రశ్నలోని ఉద్దేశం నాకు తెలుసు కానీ… నిజానికి రామారావుగారు లేకపోయి ఉంటే ఈ రోజున దేవిక మీ ముందు ఉండేది కాదు…” అని అన్నారామె. ప్రశ్న అడిగినవ్యక్తి ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఇంతకూ ఏమిటి విషయం అంటే – యన్టీఆర్ సరసన దేవిక ‘కంచుకోట’ జానపద చిత్రంలో నాయికగా నటించారు. ఆ సినిమాలో వారిద్దరిపై “లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు…” అనే పాటను తమిళనాడులోని హొగినేకల్ వాటర్ ఫాల్స్ వద్ద చిత్రీకరించారు. ఆ పాట చిత్రీకరణ సమయంలో దేవిక కాలు జారి కొట్టుకుపోతున్నారట. అప్పుడు రామారావు ఎంతో చాకచక్యంతో దేవికను రక్షించారు. అందువల్ల దేవిక తాను ప్రాణాలతో తరువాత నటిగా కొనసాగడానికి రామారావే కారణం అంటూ చెప్పుకొనేవారు. ఆమె ఎప్పుడూ ఎన్టీఆర్ పట్ల అభిమానం చూపేవారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here