సీఎం వైఎస్ జగన్ భయపడుతున్నారు.. పాదయాత్ర చేయడానికి డీజీపీ ఆధార్ కార్డు అడుగుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. ఎన్టీఆర్ జిల్లా మైలవరం, గొల్లపూడి, కొండపల్లి ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆద్వర్యంలో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు.. స్థానిక వినాయకుడి వద్ద కొబ్బరికాయలు కొట్టి ర్యాలీగా ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్ళి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు దేవినేని ఉమ.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పులివెందుల పిల్లి భయపడుతుంది.. జాబ్ క్యాలెండర్ ఏమైంది? విశాఖ ఉక్కు ఏమైపోయింది? పోలవరం ఏమైపోయింది?ఏమైపోయింది అమరావతి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికే యువగళం, ప్రశ్నించడానికి 5 కోట్ల ప్రజలు వస్తారని హెచ్చరించారు దేవినేని ఉమ.. 27న కుప్పంలో లోకేష్ బాబుతో మేం కూడా భాగస్వాములమవుతున్నాం అన్నారు.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర జరిగి తీరుతుందని ప్రకటించారు. ప్రజల ఆవేదనని ప్రశ్నించడానికే యువగళం అని వెల్లడించారు దేవినేని ఉమ..