ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. ఖాళీ అవుతున్న సీట్లకు త్వరలో ఎన్నికలు జరుగుతాయి. పట్టభద్రులు- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది ఎన్నికల సంఘం. 2023 మార్చి 29 తేదీన ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తుండటంతో ఓటర్ల నమోదు ప్రక్రియ షెడ్యూల్ ప్రకటన విడుదలైంది. 2022 అక్టోబరు 1 తేదీ నుంచి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు బహిరంగ ప్రకటన జారీ చేయాలని ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు జారీ అయ్యాయి. 2022 నవంబరు 7 తేదీ నుంచి ఫాం 18 ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని సూచనలు అందాయి.
2022 నవంబరు 23 తేదీ నాటికి ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించాలని స్పష్టం చేసింది. 2022 డిసెంబర్ 30 తేదీనాటికి ఓటర్ల తుది జాబితా రూపొందించాలని ఆదేశాలు. 2023 మార్చి 29 తేదీ నాటికి ముగియనున్న , ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి వై శ్రీనివాసుల రెడ్డి పదవీ కాలం ముగుస్తుంది. అలాగే, కడప- అనంతపురం-కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి వై గోపాల్ రెడ్డి పదవీ కాలం ముగియబోతోంది.
శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ నేత పీవీఎన్ మాధవ్ పదవీ కాలం ముగియబోతోంది. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి విఠపు బాలసుబ్రమణ్యం పదవీ కాలం ముగుస్తుంది. కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి కత్తి నర్సింహారెడ్డి పదవీ కాలం ముగియనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రులు, టీచర్ల ఓటర్ల నమోదు ప్రక్రియపై అధికారులు ఫోకస్ పెట్టనున్నారు.