తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే ఏ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారు?. మెదక్‌లో బరిలోకి దిగుతారని బీజేపీ భావిస్తోంది. అదే జరిగితే ఆయన్ని ఓడించి తీరతానంటూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఉవ్విళ్లూరుతున్నారు. ఆ సెగ్మెంట్‌ని కమలదళానికి ప్రత్యేక నియోజకవర్గంగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే కాషాయం పార్టీ తరఫున ఆలె నరేంద్ర 1999-2004లో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్‌ని 2020లో జరిగిన ఉపఎన్నికలో బీజేపీ కైవసం చేసుకుంది.
ఆ ఉత్సాహంతోనే స్థానిక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఈ ప్రకటనలు చేస్తున్నారు. 2023 శాసన ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మూడు నుంచి నాలుగు సీట్లను తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ ఆశిస్తోంది. 2019 సాధారణ ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానంలో బీజేపీ ఏకంగా రెండు లక్షల ఓట్లు సంపాదించింది. మొత్తం ఓట్లలో 17 శాతం వాటాతో మూడో స్థానంలో నిలిచింది. దుబ్బాక, సంగారెడ్డి, పటాన్‌చెరు అసెంబ్లీ సెగ్మెంట్లలో సైతం మంచి ఓటింగ్ పర్సంటేజీని సొందింది.
ఈ నేపథ్యంలో 2024 లోక్ సభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ని ఓడించడం ద్వారా రికార్డ్ క్రియేట్ చేస్తామని రఘునందన్‌రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మెదక్‌తోపాటు తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల పైనా బీజేపీ నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా 17 లోక్‌సభ నియోజకవర్గాలకు 14 మంది కేంద్ర మంత్రులను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించింది. క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లతోపాటు కేంద్ర మంత్రులు ఆయా సెగ్మెంట్లలో మూడు రోజుల పాటు బస చేస్తారు. స్థానిక పార్టీ నేతలు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సమావేశమవుతారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేస్తారు. ఈ మేరకు మెదక్ నియోజకవర్గ బాధ్యతలను బీజేపీ జాతీయ మైనారిటీ విభాగం సీనియర్ లీడర్ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీకి ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అప్పగించారు. కానీ నఖ్వీ.. మంత్రి పదవికి రాజీనామా చేయటం, ఎన్‌డీఏ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి ఎన్నిక రేసులో ఉండటంతో ఆయన స్థానంలో మెదక్ ఇన్‌ఛార్జ్‌గా మరో నాయకుణ్ని నియమించనున్నారు. మరోవైపు.. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రయత్నాలను మానుకొని మళ్లీ గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగితే ఆయన్ని మట్టికరిపిస్తానని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇవాళ ప్రకటించారు.
ఈ మేరకు అక్కడ ఇప్పటినుంచే సీరియస్‌గా దృష్టిపెట్టానని చెప్పారు. తాను టీఆర్‌ఎస్ జెండా కప్పుకున్నది కూడా అక్కడేనని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని నందిగ్రామ్ నియోజకవర్గంలో సువేంధు అధికారి ఓడించినట్లు గజ్వేల్‌లోనూ అదే సీన్‌ను రిపీట్ చేస్తామని తేల్చిచెప్పారు. మొత్తానికి కేసీఆర్ పైన పోటీచేయటానికి బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు రెడీగా ఉన్నారు. మరి ఆయన్ని ఎవరు ఓడిస్తారో చూడాలి.