పోలవరం ముంపు గ్రామాల్లో హై టెన్షన్ నెలకొంది. ఇటీవల గోదావరి వరద కారణంగా పోలవరం ప్రాజెక్టు పరిధిలోని పలు గ్రామాలు నీట మునిగాయి. అయితే ఆయా గ్రామాలను అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు ఆదుకోలేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలం శివారులో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దు వద్ద ఐదు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. ధర్నా చేపట్టి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పిచ్చుకలపాడు, పురుషోత్తమ పట్నం, ఎటపాక, గుండాల, కన్నాయిగూడెంలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వంటా వార్పు కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. అయితే ముంపు గ్రామాల ప్రజల ధర్నాను అడ్డుకునేందుకు ఏపీ, తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. వంటా వార్పు, ర్యాలీలకు అనుమతి లేదని ఏపీ పోలీసులు స్పష్టం చేశారు.
కాగా 2008లో పోలవరం ముంపు బాధితుల కోసం వైఎస్ఆర్ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ భూములను ఇంటి నిర్మాణం కోసం కేటాయించారు. అయితే ఈ ప్యాకేజీలో 2014లో కేంద్ర ప్రభుత్వం ఏపీలో కలిపిన ఐదు గ్రామాలు లేవు. అంతేకాకుండా ఈ ఐదు గ్రామాలకు చెందిన విద్యార్థులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు వారి గ్రామాల్లో చదివి.. ఆ తర్వాత ఆరు నుంచి పదో తరగతి వరకు భద్రాచలం పట్టణం లేదా దుమ్ముగూడెం మండలం నరసాపురం గ్రామానికి వెళ్తారు. దీంతో వీరికి స్థానికత విషయంలో రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి.ఈ ఐదు గ్రామాలకు భద్రాచలం నియోజకవర్గ కేంద్రం ఒకటి నుంచి 9 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అటు కొత్తగూడెం జిల్లా కేంద్రం 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఇప్పుడు ఏపీలో కలపడంతో నియోజకవర్గ కేంద్రమైన రంపచోడవరం 120 కిలోమీటర్ల దూరం అవుతోంది. అంతేకాకుండా జిల్లా కేంద్రమైన పాడేరు 480 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో ఇలాంటి పరిస్థితుల్లో తమను తెలంగాణలో కలపాలని ఏపీలోని ఐదు గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు.