GHMC: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. రోజుకు కోటి రూపాయల వరకు కేవలం వడ్డీకే కడుతోంది. ఇంట్రస్ట్ కట్టిన తర్వాత మిగిలిన డబ్బునే ఖర్చులకు వాడుకుంటోంది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో గతేడాదే అకౌంట్ ఓపెన్ చేసింది. తనకు వచ్చే ఆదాయాన్ని ఆ ఖాతాలో వేయగా అందులోంచి అసలు, వడ్డీలను ఎస్‌బీఐ మినహాయించుకున్నాక ఉన్న డబ్బునే వేతనాలకు, రోజువారీ కార్యకలాపాలకు, నిర్వహణకు వినియోగించుకుంటోంది.
జీహెచ్‌ఎంసీ గడచిన ఎనిమిదేళ్లలో (2014 నుంచి ఇప్పటివరకు) 5,275 కోట్ల రూపాయలు అప్పుచేసింది. ఆ రుణాలను 7.05 శాతం నుంచి 10.23 శాతం వరకు వడ్డీకి తీసుకుంది. ఈ వివరాలు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వెలుగులోకి వచ్చాయి. నగరవాసి ఒకరు ఆర్టీఐ అప్లికేషన్ దాఖలుచేయగా జీహెచ్‌ఎంసీ వీటిని వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ తీసుకున్న లోన్లలో ప్రధానంగా మూడు పెద్దవి ఉన్నాయి. 1. రూ.2500 కోట్లు 2. రూ.1460 కోట్లు 3. రూ.680 కోట్లు. ఈ మూడు రుణాలనూ ఎస్‌బీఐ నుంచే పొందింది.
read more: Nagababu-Narayana: నాగబాబు కూడా తక్కువేం “తినలేదు”.. నారాయణకు మించి..
మరో మూడు లోన్ల(రూ.495 కోట్ల)ను బాండ్ల విక్రయం ద్వారా స్వీకరించింది. ఇంకో రెండు లోన్ల(రూ.140 కోట్ల)ను హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(హడ్కో) నుంచి తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్‌ఎంసీ బడ్జెట్ అంచనాలను పరిశీలిస్తే మొత్తం ఆదాయం రూ.6,321 కోట్లు కాగా అందులో రూ.1,302 కోట్లు అప్పులే కావటం గమనార్హం. ఈ ఇన్‌కంలో రూ.3,434 కోట్లు రెవెన్యూ ఆదాయం కాగా రూ.2,887 కోట్లు క్యాపిటల్ ఇన్‌కంగా పేర్కొన్నారు.
స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఆర్‌డీపీ), స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రాం(ఎస్‌ఎన్‌డీపీ), డబుల్ బెడ్రూం ఇళ్లు తదితర పథకాల అమలు కోసం ఈ అప్పులు చేశారు. ఈ ఫండ్స్‌ని ఏవిధంగ ఖర్చుపెట్టారో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లేదా జీహెచ్‌ఎంసీ సర్కిళ్ల వారీగా డేటా ఇవ్వాలని కోరగా నిధులను ఆవిధంగా కేటాయించలేదంటూ చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్పారు. ఈ నేపథ్యంలో.. సొంత ఆదాయం పెంచుకోకుండా కేవలం అప్పుల మీదే ఆధారపడి పప్పు కూడు తినటం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.