తెలంగాణ గవర్నర్ తమిళిసై ఎప్పుడూ బిజీగా వుంటారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఆమె పర్యటిస్తూ వుంటారు. తాజాగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నల్లగొండ జిల్లాలో పర్యటించారు. రాణి రుద్రమదేవి తెలుగు ప్రజలకు మాత్రమే కాదు దేశ మహిళలకు స్ఫూర్తి వనిత అన్నారు గవర్నర్. మహిళా సాధికారికతకు, పరిపాలన దక్షతకు ఆమె నిదర్శనమని గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ (మం) చందుపట్ల గ్రామంలో కాకతీయ వీర వనిత రాణి రుద్రమదేవి కాంస్య విగ్రహానికి నివాళులర్పించారు.
అనంతరం ఆమె అలనాటి శిలాశాసనాన్ని సందర్శించారు. శిలాశాసనం చరిత్ర స్థల ప్రాధాన్యతను స్థానికులను, చరిత్రకారులను అడిగి తెలుసుకున్నారు. చరిత్రకు సజీవ సాక్షంగా నిలిచిన శిలాశాసనంపై లిఖి౦చబడ్డ వ్యాఖ్యలను క్షుణ్ణంగా పరిశీలించారు గవర్నర్. కాగా క్రీ.శ 1289లో తన సామంత రాజుతో యుద్ధం చేస్తూ రాణి రుద్రమదేవి వీర మరణం పొందినట్టు ఇక్కడ లభించిన శిలాశాసనం చెబుతోంది. చందుపట్లకు వచ్చిన గవర్నర్ కు జాయింట్ కలెక్టర్, అధికారులు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. భారీ భద్రత ఏర్పాటుచేశారు. అక్కడి స్థానికులతో గవర్నర్ ముచ్చటించారు.