కేరళలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది.. కలెక్టర్‌గా ఉన్న భార్య.. బదిలీపై వెళ్లిపోతూ.. తన బాధ్యతలను భర్తకు అప్పగించింది.. అదేంటి? అదేమైనా ఇంట్లో పనా? ఆస్తి వాటానా? భర్తకు అప్పగించడం ఏంటి? అనే అనుమానం రావొచ్చు.. విషయం ఏంటంటే.. ఆయనకు కూడా కలెక్టర్ బాధ్యతలు చేపట్టేందుకు అన్ని అర్హతలున్నాయి.. అందరినీ ఆశ్చ్యరానికి గురిచేస్తూ.. రాజకీయ దుమారం రేపుతోన్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని అలప్పుళ జిల్లా కలెక్టర్ రేణు రాజ్ తాజాగా బదిలీ అయ్యారు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. ఆమె స్థానంలో శ్రీరామ్ వెంకట్రామన్‌ను కలెక్టర్‌గా నియమించింది సర్కార్.. రేణు, శ్రీరామ్.. ఇద్దరూ భార్యాభర్తలు కావడం ఓ విశేషం కాగా.. అతని పోస్టింగ్‌ను రద్దు చేయాలంటూ యూడీఎఫ్ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.. నిరసనలతో ఆయనకు స్వాగతం చెప్పినట్టు అయ్యింది..
రేణు రాజ్, శ్రీరామ్ గతంలో వైద్యులుగా పనిచేశారు.. కానీ, ఆ తర్వాత ఐఏఎస్‌లుగా మారిపోయారు.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే వీరి పెళ్లి జరిగింది.. రాష్ట్ర ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న శ్రీరామ్… మంగళవారం భార్య రేణు నుంచి అలప్పుళ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.. తన సీటులో కూర్చోవల్సిందిగా శ్రీరామ్‌ను ఆహ్వానించిన రేణు.. షేక్ హ్యాండ్ ఇచ్చి చైర్‌లో కూర్చోబెట్టారు.. ఇదే సమయంలో యూడీఎఫ్ ఆందోళన నిర్వహించడంతో.. ఆయనకు నిరసనలతో స్వాగతం పలికినట్టు అయ్యింది. అయితే, యూడీఎఫ్ ఆందోళన చేయడం వెనుక అసలు కారణం వేరే ఉంది.. భార్య నుంచి భర్త బాధ్యతలు స్వీకరించినందుకు వారు నిరసన తెలియజేయలేదు.. ఎందుకంటే.. గతంలో శ్రీరామ్ వెంకట్రామన్‌పై ఓ కేసు నమోదైంది.. 2019లో శ్రీరామ్.. తన స్నేహితురాలితో కలిసి కారులో వెళ్తూ.. ఓ బైక్‌ను ఢీకొట్టగా.. ఆ బైక్‌పై ఉన్న జర్నలిస్టు కన్నుమూశాడు.. అయితే, ఆ కేసులో బెయిల్ పొంది, విచారణ ఎదుర్కొంటున్న శ్రీరామ్‌ను కేరళ సర్కార్ గత రెండేళ్ల క్రితం మళ్లీ విధుల్లోకి తీసుకుంది. జాయింట్ సెక్రటరీగా ఉన్న అతడికి ఇప్పుడు కలెక్టర్ పోస్టు ఇవ్వడంపై యూడీఎఫ్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మొత్తంగా.. భార్య బాధ్యతల నుంచి తప్పకున్నా.. ఆ వెంటనే భర్త అదే సీటులో కూర్చొని రూలింగ్ చేయడం మాత్రం వైరల్‌గా మారిపోయింది.