Interesting News: బస్ షెల్టర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎవరొస్తారు? సహజంగా ఏ ప్రజాప్రతినిధో, ప్రభుత్వాధికారో వస్తారు. కానీ కర్ణాటకలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానికులు ఓ గేదెను తీసుకొచ్చారు. దాంతోనే రిబ్బన్ కట్ చేయించారు. ఆ వీడియో వైరల్‌గా మారటంతో లోకల్ ఎమ్మెల్యే స్పందించాడు. టెంపరరీ బస్ షెల్టర్ కాకుండా పర్మనెంట్‌గా, పక్కాగా బస్ షెల్టర్ నిర్మిస్తామని హామీ ఇచ్చాడు. అసలేం జరిగిందంటే.. కర్ణాటకలోని గడగ్ జిల్లాలో బాలెహొసుర్ అనే ఊరు ఉంది.
ఆ గ్రామంలో 40 ఏళ్ల కిందట నిర్మించిన బస్ షెల్టర్ కూలిపోయి చానాళ్లయింది. కొత్తది కట్టించాలంటూ ఊరి జనం అధికారులను వేడుకుంటున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవటంతో సమస్యను జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా పది మంది దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అందరూ కలిసి కొంత డబ్బు పోగేసి కొబ్బరి మట్టలతో తాత్కాలికంగా బస్ షెల్టర్‌ను ఏర్పాటుచేశారు. ఓపెనింగ్ ప్రోగ్రామ్‌ని వెరైటీగా నిర్వహించాలని అనుకున్నారు. బస్ షెల్టర్‌కి రిబ్బన్ కట్టి దాన్ని ఒక గేదెతో కట్ చేయించారు.
also read: Telangana Governor: జై తమిళిసై.. ప్రజల్లోకి వెళుతూ ప్రత్యేకంగా నిలుస్తున్న తెలంగాణ గవర్నర్.
వాస్తవానికి గేదె కట్ చేయలేదు. స్థానికులే కత్తెరతో రిబ్బన్‌ను కత్తిరించారు. కానీ ఫొటోలు, వీడియోలు చూస్తే నిజంగా గేదే రిబ్బన్ కట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. దీంతో ఈ విజువల్స్ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయ్యాయి. శిరాహట్టి ఎమ్మెల్యే రామప్ప లమణి దీనిపై స్పందించారు. సమస్య తన దాకా రాలేదని చెప్పారు. త్వరలో ఆ ఊరికి వెళ్లి కొత్త బస్ షెల్టర్ నిర్మాణానికి చర్యలు చేపడతానని తెలిపారు. సరైన బస్ షెల్టర్ లేకపోవటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూల్ పిల్లలు, కాలేజీ విద్యార్థులు నిలువ నీడ లేక చుక్కలు చూస్తున్నారు.
వర్షా కాలం వచ్చిందంటే వాళ్ల బాధలు వర్ణణాతీతంగా మారుతున్నాయి. బస్సుల కోసం వెయిట్ చేయాలంటే దగ్గరలోని ఇళ్లల్లో లేదా హోటల్స్, షాపుల కింద నిలబడాల్సి వస్తోంది. దాదాపు రెండేళ్ల నుంచి ఈ దుస్థితి నెలకొంది. ఎంపీ, ఎమ్మెల్యేలకు విన్నవించినా పట్టించుకున్న పాపానపోలేదు. చూస్తాం.. చేస్తాం.. అంటున్నారే గానీ సమస్య పరిష్కారానికి పూనుకున్నది లేదు. దీంతో చేసేదేమీ లేక గ్రామస్థులు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. శాసన సభ్యుడు మళ్లీ హామీ ఇచ్చాడు. ఇప్పటికైనా బస్ షెల్టర్ కట్టించి ఇస్తాడా లేదా అనేది కాలమే చెప్పాలి.