అన్నవరం చేరుకున్న జనసేనాని.. వారాహి యాత్రకు అంతా రెడీ..

0
181

జనసేన అధినేత చేపట్టనున్న వారాహి యాత్రకు సర్వం సిద్ధమైంది.. పోలీసు అధికారులు ఓకే చెప్పడంతో జనసేన శ్రేణులు రిలీఫ్‌ అయ్యాయి. వారాహి యాత్రకు లైన్‌ క్లియర్‌ అవడంతో.. రూట్‌ మ్యాప్‌ ప్రకారం జనసేనాని జనంలోకి వెళ్లనున్నారు. ఇవాళ రాత్రికి అన్నవరంలో బస చేయనున్న పవన్‌.. రేపు సత్యదేవుని సన్నిధిలో పూజలు చేసి వారాహి ఎక్కనున్నారు. కత్తిపూడిలో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు జనసేనాని..

ఇక, అమరావతిలోని జనసేన పార్టీ ఆఫీసులో రెండ్రోజుల యాగ క్రతువు పూర్ణాహుతితో పరిసమాప్తమైంది. బుధవారం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి వారాహి యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు పవన్‌కల్యాణ్‌. వారాహి యాత్రకు ఎలాంటి అభ్యంతరాలు లేవని పోలీసులు ప్రకటించడంతో జనసేన శ్రేణులు ఫుల్‌ జోష్‌ మీదున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్‌, ముమ్మడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు.. మొత్తం నియోజకవర్గాల మీదుగా వారాహి యాత్ర పది రోజుల పాటు జరగనుంది.

కోనసీమ, కాకినాడ జిల్లాల్లో సెక్షన్‌ 30ని అమల్లోకి తెచ్చిన పోలీసులు.. వారాహి యాత్రకు మినిట్‌ టు మినిట్‌ ప్రోగ్రాం ఇవ్వలేదని, మైక్‌ పర్మిషన్లు కోరలేదని చెప్పడంతో.. మూడు నాలుగు రోజుల పాటు ఉత్కంఠ కొనసాగింది. అసలు వారాహి యాత్రకు పోలీసులు పర్మిషన్‌ ఇస్తారా లేదా అనే టెన్షన్‌ కొనసాగింది. ఎట్టకేలకు వారాహి యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో సస్పెన్ష్‌కు తెరపడింది. డీఎస్పీలతో జనసేన నేతలు టచ్‌లో ఉన్నారు. భారీ పోలీసు భద్రత మధ్య రూట్‌ మ్యాప్‌ ప్రకారం జనంలోకి వెళ్లనున్నారు పవన్. వారాహి యాత్రకు పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌.

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో వారాహికి పూజలు చేశాక బుధవారం మధ్యాహ్నం ర్యాలీగా బయల్దేరి ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడి చేరుకోనున్నారు పవన్‌. సాయంత్రం 4గంటలకు కత్తిపూడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 16న పిఠాపురం, 18న కాకినాడ, 20న ముమ్మిడివరం, 21న అమలాపురం, 22న మలికిపురం..మొత్తం ఆరు బహిరంగ సభలు ఉండడంతో అన్నిటినీ సక్సెస్ చేసేందుకు జనసేన శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమాలుంటాయి. మేధావులు, న్యాయవాదులు, పలు రంగాలకు చెందిన ప్రతినిధులతో పవన్‌ సమావేశాలుంటాయి. ఇక, వారాహి యాత్ర సమన్వయానికి 7 కమిటీలను నియమించింది జనసేన. ఏపీకి త్వరలోనే ఎన్నికలు వస్తాయన్న పవన్‌ ప్రకటనతో ఈ యాత్రను మరింత సక్సెస్ చేసేందుకు యత్నిస్తున్నారు పార్టీ నేతలు, టికెట్‌ ఆశావహులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here