మాజీ మంత్రి కాంగ్రెస్‌లోకి అంటూ ప్రచారం..! కాదు మొర్రో అంటున్న ఆ నేత..!

0
906

మాజీ మంత్రి, టీఆర్ఎస్‌ సీనియర్‌ నేత జూపల్లి కృష్ణారావుకు అదే పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యేకు మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. మాటల యుద్ధం, విమర్శలు, ఆరోపణలు, ఫిర్యాదుల పర్వం కొనసాగుతూ రాగా.. గత కొంత కాలంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కి మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది.. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో నియోజకవర్గం అభివృద్ధి, అవినీతి విషయంలో ఇరువురు నేతలు చేసుకున్న సవాళ్లు ప్రతిసవాళ్ల పర్వంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం కూడా తెలిసిందే.. అయితే, పార్టీకి దూరంగా ఉంటున్న జూపల్లిపై ఎప్పటి నుంచే రకరకాల ప్రచారాలు సాగుతూనే ఉన్నాయి.. తాజాగా, ఓ ప్రచారం సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తోంది.. దీంతో.. ఆయన వర్గం క్లారిటీ ఇచ్చే పనిలో పడిపోయింది..

అయితే, జూపల్లి కృష్ణారావు త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారిపోయింది.. ఇక, ఈ మధ్య అంతర్గత విభేధాలు రచ్చకు ఎక్కడంతో ఇది నిజమేననే భావన కూడా మొదలైంది.. త్వరలోనే జూపల్లి.. హస్తం పార్టీలో చేరడం ఖాయమనే ప్రచారం గుప్పుమంది.. ఇది కాస్తా, జూపల్లి కృష్ణారావు వరకు వెళ్లింది.. దీంతో, క్లారిటీ ఇచ్చే పనిలో పడిపోయారు జూపల్లి.. సోషల్ మీడియాలలో వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నారు.. మీతో చెప్పకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోను… ఎవ్వరూ నమ్మవద్దు.. అంటూ తన అనుచరులు, పార్టీ శ్రేణులకు మెసేజ్‌లు పెడుతున్నారట మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. మొత్తంగా జూపల్లి ఎలాంటి రాజకీయ వ్యూహాలతో ఉన్నారో తెలియదు.. కానీ, ఆయన ప్రత్యర్థులు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.. అయినా, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. రాష్ట్రంలో పొలిటికల్ జంపింగ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి.. మరి జూపల్లి కృష్ణారావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కాలమే చెబుతుంది. మాజీ మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here