KCR-JAGAN: కేసీఆర్‌ని పిలవలేదు.. జగన్‌ని పిలిచినా పోలేదు. సరిపోయింది!

0
669

KCR-JAGAN: దేశ రాజధాని ఢిల్లీలో రాత్రి ఒక డిన్నర్‌ జరిగింది. ఆ విందుని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ పదవీ కాలం రేపటితో ముగియనున్న నేపథ్యంలో ఆయన గౌరవార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. దానికి కొత్త రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ము, కేంద్ర మంత్రులు, 21 మంది ముఖ్యమంత్రులు, పద్మ అవార్డు గ్రహీతులు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు హాజరయ్యారు. అయితే ఈ డిన్నర్‌కి ఎవరెవరిని పిలిచారు? ఎవరెవరిని పిలవలేదు? అనే దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఎన్డీఏలోని పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఉపముఖ్యమంత్రులను ఆహ్వానించారు. వారితోపాటు ద్రౌపదీ ముర్ముకు మద్దతిచ్చిన ఎన్డీఏయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా పిలిచారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఈ జాబితాలో ఉన్నారు. యశ్వంత్‌సిన్హాకు సపోర్ట్‌ చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని పిలవని ప్రధాని మోడీ అదే పనిచేసిన తమిళినాడు సీఎం ఎంకే స్టాలిన్‌ని ఆహ్వానించటం మాత్రం ఆశ్చర్యకరం.

read also: గుడ్‌న్యూస్.. మరో 2,440 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి

అయితే.. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఈ విందుకి కేసీఆర్‌ పిలవకపోవటం వల్ల పోలేదు. జగన్‌ని పిలిచినా పోలేదు. దీంతో “సరిపోయింది” అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది రామ్‌నాథ్‌కోవింద్‌ గౌరవార్థం అనే సంగతిని మర్చిపోకూడదు. ఆయన్ని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ నిలబెట్టినప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌ మద్దతిచ్చారు. కాబట్టి ఆయన్ని ఈ డిన్నర్‌కి ఆహ్వానించాల్సింది. ఇది ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకారం కాదు. అదే అయినట్లయితే ఆమెకు కేసీఆర్‌ సపోర్ట్‌ చేయలేదు కాబట్టి ఆయన్ని పిలవలేదు అనుకోవచ్చు.

కానీ ఇది రామ్‌నాథ్‌కోవింద్‌ కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విందు. దానికి కేసీఆర్‌ని ఆహ్వానిస్తే బాగుండేది. అఫ్‌కోర్స్‌ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్‌ని ఆహ్వానించినా ఆయన వెళ్లకపోయేవారు. జగన్‌, నవీన్‌ పట్నాయక్‌ కూడా అదే చేశారు. పిలిచినా పోలేదు. అసలు రామ్‌నాథ్‌కోవింద్‌ రాష్ట్రపతి పదవికి పోటీచేసినప్పుడు జగన్‌ ముఖ్యమంత్రిగానే లేరు. అయినా ఆయన్ని ఇప్పుడు ఆహ్వానించటం ప్రస్తావనార్హం. ఏమాటకామాట. రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు కూడా వెలువడ్డాయి. కాబట్టి ప్రధాని మోడీ పాలిటిక్స్‌ని పక్కనపెట్టి అన్ని రాష్ట్రాల సీఎంలను ఇన్వైట్‌ చేస్తే ఆయనకే క్రెడిట్‌ దక్కేది.

అలా చేయకపోవటంతో ‘ఫలానా ముఖ్యమంత్రులను పిలవలేదట’ అనే అపవాదును మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఇంకో విషయాన్ని ప్రస్తావించొచ్చు. అదేంటంటే.. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇంకా పూర్తికాలేదు. ప్రతిపక్షాలు బరిలో నిలబెట్టిన మార్గరెట్‌ ఆళ్వాకి కేసీఆర్‌ ఇప్పటికీ సపోర్ట్‌ ప్రకటించలేదు. కాబట్టి రామ్‌నాథ్‌కోవింద్‌ గౌరవార్థం ఇచ్చిన విందుకి కేసీఆర్‌ని పిలిచి ఉంటే ఆయన ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్‌ ధన్‌కర్‌కి మద్దతిచ్చేవారేమో. తాజా పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్‌ కూడా మమతా బెనర్జీ మాదిరిగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంటారేమో అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here