KCR: కేసీఆర్‌.. క్యా హుషార్‌.. “సినిమా” చూపించావు సార్‌.

0
762

కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమ సమయంలో బహిరంగ సభల్లో బాగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ప్రెస్‌ మీట్లనే ఆన్‌లైన్‌ పబ్లిక్‌ మీటింగ్‌ల మాదిరిగా మర్చేశారనే టాక్‌ వినిపిస్తోంది. ఎందుకంటే కేసీఆర్‌ ప్రెస్‌ మీట్‌ పెట్టారంటే చాలు. మౌత్‌ పబ్లిసిటీ ద్వారా పాకిపోతోంది. దీంతో మీడియాతోపాటు సాధారణ ప్రజలు కూడా టీవీల ముందు వాలిపోతున్నారు. పెద్దలే కాదు పిల్లలు కూడా ఫోన్లలో, టీవీల్లో సినిమాలు చూడటం మానేసి కేసీఆర్‌ ప్రెస్‌ మీట్‌ను చూస్తున్నారు. సందర్భం, సబ్జెక్ట్‌, సెటైర్లు, కామెడీ, ప్రాసలు, తిట్లు.. ఇలా అన్నీ ఆయన ప్రెస్‌ మీట్‌లో ఉంటాయి.

రెగ్యులర్‌గా ప్రెస్‌ మీట్‌ పెట్టకుండా మూడు, నాలుగు నెలలకోసారి పూర్తి స్థాయిలో ప్రిపేరై మీడియా ముందుకు వస్తున్నారు. కేసీఆర్‌ ప్రెస్‌ మీట్లకు ఉన్నంత ఫాలోయింగ్‌ దేశంలోని ఏ ఇతర లీడర్ల ప్రెస్‌ మీట్లకూ ఉండదంటే అతిశయోక్తి కాదు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలగటం ఆయన ప్రత్యేకత. హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో సింపుల్‌ పదాలు వాడతారు. ప్రెస్‌ మీట్‌లో కేసీఆర్‌ బాడీ లాంగ్వేజ్‌ కూడా భలే ఉంటుంది. మనిషి ఊగుతూ మాట్లాడతారు. జనాన్ని ఉర్రూతలూగిస్తారు. నవ్విస్తారు. ఆలోచింపజేస్తారు. ‘అరె.. కేసీఆర్‌ చెప్పింది నిజమే కదా’ అనిపిస్తారు.

కేసీఆర్‌కి ఉన్నంత టాకింగ్‌ పవర్‌ దేశం మొత్తమ్మీద ప్రధాని మోడీకి తప్ప మరెవరికీ లేదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే మోడీ సైతం కేసీఆర్‌ వేసినంతగా సెటైర్లు వేయరు. మోడీ ప్రసంగాలు గానీ, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ స్పీచ్‌లు గానీ సీరియస్‌గా సాగుతాయి. కానీ కేసీఆర్‌ అలా కాదు. జోవియల్‌గా మాట్లాడతారు. ఉదాహరణకు మొన్న ఆదివారం కేసీఆర్‌ సుమారు రెండున్నర గంటల పాటు ప్రెస్‌ మీట్‌లో మాట్లాడారు. అంటే దాదాపు ఒక సినిమా నిడివి అంత. ఈ మీడియా సమావేశం రెండున్నర గంటల సేపు సాగినా అప్పుడే అయిపోయిందా అనిపించింది. అక్కడక్కడా “ముండమోపి” లాంటి కొన్ని హార్డ్‌ పదాలు వాడారు.

సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడకూడదు. కానీ మాస్‌ పీపుల్‌ని ఆకట్టుకోవాలంటే తప్పదు. నిజానికి ఆ మాట కేసీఆర్‌ నోట వచ్చినప్పుడు విన్నవాళ్లంతా ఘొల్లున నవ్వారు. కట్టప్పలేడు.. కాకరకాయ లేడు.. అనే ప్రాసలతో కూడిన పదాలూ ప్రయోగించి పగలబడి నవ్వేలా చేశారు. సన్నాసి అనే మాటా అన్నారు. సాధారణ జనాన్నీ తన వైపు తిప్పుకున్నారు. జనం ఎక్కువగా మాట్లాడే పదాలనే కేసీఆర్‌ సెలెక్ట్‌ చేసుకుంటారు. ఆయన తాజాగా నిర్వహించిన ఒక్క ప్రెస్‌ మీట్‌కి కౌంటర్‌గా బీజేపీ నుంచి నలుగురైదుగురు, కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు ముగ్గురు మీడియా ముందుకు వచ్చారంటే కేసీఆర్‌ ఏ రేంజ్‌లో విపక్షాలపై విసురుకున్నారో అర్థంచేసుకోవచ్చు.

కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌లో జర్నలిస్టులు సైతం జబర్దస్త్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఖతర్నాక్‌ కామెడీ షో చూస్తున్నారు. ఆయనకి రెండు పక్కల, వెనక కూర్చునే మంత్రులు, ప్రజాప్రతినిధులదీ ఇదే పరిస్థితి. రాహుల్‌ అనే హిందూ పత్రిక విలేకరి పేరును కేసీఆర్‌ ఇంకా ప్రస్తావించట్లేదేంటా అని అందరూ ఎదురుచూస్తారు. వాళ్ల కోరికనూ కేసీఆర్‌ తీరుస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆ పేరును ఒకటికి రెండు సార్లు హైలైట్‌ చేస్తున్నారు. మళ్లీ ఎప్పుడు ప్రెస్‌ మీట్‌ పెడతారా అని జనం ఆతృతతో వెయిట్‌ చేస్తున్నారు. దటీజ్‌ కేసీఆర్‌. క్యా హుషార్‌ సార్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here