ఢిల్లీ లిక్కర్‌ కేసులో అనూహ్య పరిణామాలు

0
66

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఒకేరోజులో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్కామ్‌లోని ప్రధాన నిందితుల్లో ఒకరైన శరత్‌ చంద్రారెడ్డికి భారీ ఊరట లభించింది. రౌస్‌ ఎవెన్యూ కోర్టు ఆయనకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. శరత్‌ చంద్రారెడ్డి భార్య కనికారెడ్డి అనారోగ్య పరిస్థితి దృష్ట్యా.. ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. ఇప్పుడు దాన్ని పూర్తిస్థాయి బెయిల్‌గా మార్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ను ఈనెల 23 వరకు పొడిగించింది కోర్టు. ఆయన జ్యుడీషియల్‌ కస్టడీ గడువు ముగియడంతో.. ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూ కోర్టులో హాజరు పరిచారు ఈడీ అధికారులు. సిసోడియాను మరింత లోతుగా విచారించాల్సిన అవసరముందని, కస్టడీని పొడిగించాలని కోరారు. దీంతో కోర్టు.. సిసోడియాకు జ్యుడీషియల్‌ కస్టడీని ఈనెల 23 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవకు నిరాశ ఎదురైంది. ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూ కోర్టులో ఆయన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిగింది. రాఘవకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఆయన బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసింది. ఇక ఇదే కేసులోని మరో ఇద్దరు నిందితులకు బెయిల్‌ మంజూరు చేసింది కోర్టు. రాజేష్‌ జోషి, గౌతమ్‌ మల్హోత్రాలకు రెగ్యులర్‌ బెయిల్‌ ఇచ్చింది. ఈ ఇద్దరిపై మోపిన అభియోగాల్లో మనీలాండరింగ్‌కు సంబంధించిన ఎలాంటి ఆధారాలను ఈడీ సమర్పించలేదని కోర్టు వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ మొత్తం ఒక బూటకమని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఇప్పుడు కోర్టులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని, రాజేష్‌ జోషి, గౌతమ్‌ మల్హోత్రాలకు బెయిల్‌ మంజూరు చేస్తూ.. కోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన ఓ ట్వీట్‌ చేశారు. మద్యం కుంభకోణం అంతా బూటకమని, కేవలం ఆప్‌ను కించపరిచేందుకే.. ఈ స్కామ్‌ను సృష్టించారని తాము ముందు నుంచి చెబుతున్నామని ట్వీట్‌లో పేర్కొన్నారు కేజ్రీవాల్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here