బాలయ్యపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయిన కొడాలి నాని.. తండ్రిని చంపినవాడితో షోనా..?

0
641

టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని.. అన్‌స్టాపబుల్ 2 షో ఇప్పుడు రాజకీయాలకు వేదికగా మారింది.. తొలి సీజన్‌ విజయవంతంగా పూర్తి చేసిన బాలయ్య.. రెండో సీజన్‌లో ఫస్ట్‌ ఎపిసోడ్‌కు.. టీడీపీ అధినేత, తన బావ నారా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ను ఆహ్వానించారు.. అయితే, ఆ షోకు సంబంధించిన ప్రోమో ఇప్పటికే రచ్చ చేస్తుండగా.. దానిపై రాజకీయ విమర్శలు కూడా ప్రారంభం అయ్యాయి.. దీనిపై స్పందించిన కొడాలి నాని.. తండ్రిని చంపిన చంద్రబాబుతో , షోలు చేస్తున్న బాలకృష్ణకు సిగ్గు లేదని మండిపడ్డారు. ఎన్టీఆర్ చనిపోయి 25 ఏళ్లు దాటినా షోల పేరుతో కొడుకు, అల్లుడు ఆయనను ఇంకా హింసించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గతిలేక అనేకసార్లు ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్న చంద్రబాబు.. ఇప్పుడు ప్రజల కళ్తు తిప్పే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. ఎన్టీఆర్ కు పార్టీ నడపడం చేతకాకపోతే, చంద్రబాబు బయటకు పోవాలే తప్ప, ఎన్టీఆర్ దగ్గర నుండి పార్టీ లాక్కోవడమేంటని ఫైర్‌ అయ్యారు.. ఎన్టీఆర్ ని మించిపోయినటిస్తున్న బాలకృష్ణ, అసత్య ప్రచారాలతో చంద్రబాబుతో కలిసి షోలు చేస్తున్నాడని దుమ్మెత్తి పోశారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను మరోసారి టార్గెట్‌ చేశారు కొడాలి.. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్‌.. ఓ రాజకీయ అజ్ఞాని అంటూ ఫైర్‌ అయ్యారు.. ఈనెల 15వ తేదీన విశాఖపట్నంలో పవన్ కల్యాణ్‌ నిర్వహించే జనవాణి సభలపై కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజావాణి పెట్టాల్సిన పవన్… చంద్రబాబు చిల్లరకు ఆశ పడుతున్నాడని, పవన్ కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మూడు రాజధానులకు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర జేఏసీ సభ కేవలం మూడు జిల్లాల ప్రజల ఆకాంక్షలు తెలియచేయడానికే తప్ప, ఎటువంటి బల ప్రదర్శన కాదని ఆయన స్పష్టం చేశారు. గాజువాక ప్రజల మాదిరే, రాష్ట్ర ప్రజలు కూడా పవన్ కల్యాణ్‌పై ఉమ్ము వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ జోస్యం చెప్పారు మాజీ మంత్రి కొడాలి నాని..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here