కమ్యూనిస్టుల ఐక్యత… మునుగోడులో కేసీఆర్ ప్లాన్ వర్కవుటయ్యేనా?

0
623

తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి కమ్యూనిస్టు ఐక్యతారాగం పలుకుతున్నారు. ఇప్పుడు మునుగోడు ఎన్నికల కోసం, టీఆర్ఎస్ గెలుపు కోసం కమ్యూనిస్టులు ఒకటిగా ప్రజల ముందుకెళుతున్నారు. ఈనెల12వ తేదీన ఉభయ కమ్యూనిస్టుల సభ జరగనుంది. ఉప ఎన్నిక ఎందుకోసం వచ్చింది అనేది వివరించడమే లక్ష్యంగా కమ్యూనిస్టుల బహిరంగ సభ జరుగుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కామ్రేడ్లు కలిసి వస్తే టీఆర్ఎస్ విజయం ఖాయం అనే ధీమాతోనే కేసీఆర్ వారిని కలిపారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గతంలోనూ అనేకమార్లు రెండుపార్టీలు కలిసి రావాలని అంతా భావించారు. కానీ ఇప్పుడు కాలం కలిసి వచ్చినట్టుంది. టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటన, దానికి దారితీసిన పరిస్థితులను కేడర్‌కు చెప్పాలనేది ఇరు పార్టీల ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు.

టీఆర్ఎస్ ని గెలిపించేందుకు కామ్రేడ్లు కలిసి వచ్చారు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదం ఎక్కడైనా గోడల మీద కనిపిస్తే , ఆ నినాదంపై ఛలోక్తులు వినబడేవి. ప్రపంచ కార్మికులారా ఏకంకండి… కాదు.. భారతదేశంలో కమ్యూనిస్టులు ఏకం కండి అంటూ కార్టూన్లు, కథనాలు అనేకం వచ్చాయి. ఇప్పుడు అదే దిశగా కమ్యూనిస్టులు ఒకే మాట, ఒకే బాట అన్నట్టుగా కలవనున్నాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఉమ్మడి ఆంధ్రపదేశ్లో 1980 దశకంలో ఎన్టీఆర్ ఏకం చేశారు. 1985 నాటి వరకూ కమ్యూనిస్టు పార్టీలు ఎవరిగోల వారిదే అన్నట్టుగా ఉండేవారు.. కొట్లాటలకి, ఘర్షణలకి కేంద్ర బిందువుగా వుండేవారు. సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన అనేకమంది ఆ ఘర్షణల్లో బలయిపోయిన ఘటనలు అనేకం వున్నాయి.

ప్రధానంగా నల్లగొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ ప్రాంతాలు, ఖమ్మం జిల్లాలో పాలేరు, ఖమ్మం, మధిర, వైరా ప్రాంతాలలో నిరంతరం కొట్లాటలు వుండేవి. అనేకమంది రెండుపార్టీలకు చెందినవారు చనిపోయారు. గృహదహనాలు కూడా జరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో వామపక్షాల ఐక్యత జరిగింది. ఆనాటి టిడిపి అధినేత ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాదెండ్ల భాస్కరరావు ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత జరిగిన పరిణామాలు వామపక్షాలు టీడీపీకి మద్దతు ఇచ్చాయి. దీంతో అప్పటినుంచి వామపక్షాలు టీడీపీతో కలిసి పోటీచేయడం ప్రారంభించాయి. గ్రామాల్లో లెఫ్ట్ పార్టీల మధ్య విభేదాలు తగ్గిపోయాయి. అయితే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఘటనలు.. ఆనాడు ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు తో వామపక్షాలు సఖ్యతతో వుండేవి. తర్వాత కాంగ్రెస్ వామపక్షాలు కలిసి పనిచేశాయి.

కట్ చేస్తే.. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణకు మద్దతు ఇచ్చింది సీపీఎం.. కానీ సీపీఐ మద్దతివ్వలేదు. అప్పటినుంచి రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. టీఆర్ఎస్ తో కూడా రెండుపార్టీలు కలవలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా వామపక్షాలు ఎవరి దారి వారిదే అన్నట్టుగా ముందుకుసాగాయి. సీపీఐ ఒక పార్టీకి మద్దతుగా నిలిస్తే.. సీపీఎం మరో పార్టీ పంచన చేరేది. తెలంగాణ వచ్చాక 2014లో సీపీఎం స్వతంత్రంగా పోటీచేసింది. ఒక్క ఖమ్మం జిల్లాలోనే వైసీపీతో సీపీఎం పొత్తు పెట్టుకుంది. 2018 ఎన్నికలు వచ్చేసరికి సీపీఎం బీఎల్ఎఫ్ తో కలిసి పోటీచేసింది. అయితే రెండు ఎన్నికల్లో సీపీఎంకి ఏమాత్రం అచ్చిరాలేదు. ఇకపోతే సీపీఐ మాత్రం 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీచేసింది. ఈరెండు ఎన్నికల్లో వామపక్షాలు విడివిడిగానే పోటీలో వున్నాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం సీపీఐ, సీపీఎం పార్టీలు కలిసి పోటీచేశాయి. కానీ వారిలో అంతా ఐక్యత కనిపించలేదు. ఆనాడు కూడా ఉమ్మడి సభలు జరిగినా.. తూతూమంత్రంగా జరిగిన సభలుగా మాత్రమే అవి మిగిలిపోయాయి.

ఇప్పుడు మునుగోడులో టీఆర్ఎస్ ని గెలిపించేందుకు వామపక్షాలు గట్టిగా కృషిచేస్తున్నాయి. తామే పోటీచేసిన విధంగానే భావించి ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్నాయి. రెండుపార్టీల ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో భారీ బహిరంగసభ జరగనుంది. సీపీఎం, సీపీఐ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం ఈసభలో పాల్గొంటారు. ఈ ఉమ్మడి వ్యూహం మునుగోడు వరకేనా? భవిష్యత్తులోనూ కొనసాగిస్తారా అనేది మునుగోడు ఫలితం తర్వాత తేలనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here