సారూ..! మా స్కూల్‌ని, మా జీవితాలను కాపాడండి.. సీజేకు విద్యార్థుల లేఖ..

0
1023

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని మాయదార్లపల్లి గ్రామం విద్యార్థులు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.. మారుమూల ప్రాంతమై ఎక్కడో విసరి వేయబడ్డట్లు ఉన్న కర్ణాటక బార్డర్ లోని చిట్ట చివరి గ్రామాలైన మాయదార్లపల్లి.. ఎలాంటి అభివృద్ధి పనులకు నోచుకోలేదు.. కనీసం మండల కేంద్రానికి చేరుకోవాలంటే సరైన బస్సు సౌకర్యం కూడా లేని పరిస్థితి… ఇక, ఆ గ్రామ విద్యార్థులకు కొత్త కష్టాలు వచ్చాయి.. గత 45 రోజులుగా మాయదార్లపల్లి ఆ గ్రామ విద్యార్థులను బసాపురం స్కూల్ నందు విలీనం చేశారు.. ఈ పరిణామాన్ని నిరసిస్తూ ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టిన విద్యార్థులు.. అయినా తమని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. దీనిపై ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.

ఏపీ ప్రధాన న్యాయస్థానం, నేలపాడు, అమరావతి అడ్రస్‌కి ఓ పోస్ట్ కార్డు పంపించారు విద్యార్థులు.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దివ్య సన్నిధానానికి నమస్కరించి వ్రాయునది ఏమనగా? సార్! నేను అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మాయదార్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాను మా పాఠశాలలోని 6,7,8, తరగతులను బసాపురం ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు.. కానీ, మేం మా ఊరి నుండి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో కుంట అను ప్రాంతంలో మా పెద్దలు నివసిస్తున్నారు. మేం అక్కడి నుండి పాఠశాలకు చేరుకోవడానికి నాలుగు కిలోమీటర్లు వంకలు వాగలు చెట్ల వెంబడి పుట్ల వెంబడి నడుచుకుంటూ మాయదార్లపల్లి పాఠశాలకు చేరుకుంటున్నాము.

మా తరగతులను బసాపురం గ్రామంలో ఉన్న పాఠశాలకు విలీనం చేయడంతో మేం మరల మాయదార్లపల్లి గ్రామం నుండి మరో మూడు కిలోమీటర్లు నడిచి బసాపురం గ్రామంలోని పాఠశాలకు చేరుకోవాలంటే చాలా కష్టం అందుకనే మా ఇంట్లో పెద్దలు మా చదువులు మధ్యలోని ఆపేస్తున్నారు.. మమ్ములను మా తోటి విద్యార్థులను బడి మానివేయించి మా పొలాల్లోని పనులకు, మా పశువులను, గొర్రెలను మేపడానికి సిద్ధం చేస్తున్నారు. కావున, దయగల మహాప్రభువులు.. మా పాఠశాల తరగతులను మా ఊరిలోనే నిర్వహించే విధంగా చేస్తే బాగా చదువుకుంటాం.. లేదంటే, మా తల్లిదండ్రులు మమ్ములను ఎటు పనికి రాకుండా పశువుల కాపర్లుగా, గొర్రెల కాపర్లుగా తదితర పనులకు పెట్టబోతున్నారు. అంతేకాకుండా మా పాఠశాల నాడు నేడు పనులన్నీ పూర్తి కాబడి సుందరంగా రూపురేఖలు తిద్దుకోంది. కావున, తమరు పెద్ద మనసుతో మా పాఠశాల తరగతులను బసాపురం గ్రామంలో విలీనం చేయకుండా మా చదువులు మధ్యలో ఆగిపోకుండా మమ్మల్ని ఎలాగైనా కాపాడాలని మిమ్ములను వేడుకుంటున్నాము. అంటూ రాసుకొచ్చారు విద్యార్థులు. మరి, విద్యార్థుల సమస్యలపై సీజే ఎలా స్పందిస్తారు? విద్యార్థుల పరిస్థితి ఏంటో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here