చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీకి షాక్ తగలింది. టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు జరిగాయి. ఈ మేరకు గుడిపల్లి మండలంలో టీడీపీకి 100 మంది కార్యకర్తలు గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరిపోయారు. వైసీపీలో చేరిన వారందరూ టీడీపీ సభ్యత్వ కార్డులను ప్రదర్శించడం గమనార్హం. వీళ్లంతా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కుప్పం వైసీపీ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ భరత్ నాయకత్వం లో టీడీపీ కార్యకర్తలు వైసీపీ కండువాలు కప్పుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీఎం మూడేళ్ల పాలన చూశాక కుప్పంలో కూడా వైసీపీ జెండా ఎగరాలని స్థానికులు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యం లభిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో కుప్పం నుంచి మరిన్ని చేరికలు ఉంటాయని.. కుప్పంలో టీడీపీ ఖాళీ కావడం ఖాయమని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ జెండా ఎగరడం తధ్యమన్నారు.