చంద్రబాబు లాంటి మేధావి ప్రపంచంలోనే ఉండరు..! మంత్రి సెటైర్లు

0
602

టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి సెటైర్లు వేశారు మంత్రి సిదిరి అప్పలరాజు.. చంద్రబాబు లాంటి మేధావి ప్రపంచంలోనే ఉండడు అంటూ ఎద్దేవా చేశారు.. ఇక, అమరావతి రైతుల పాదయాత్రపై సంచలన కామెంట్లు చేశారు మంత్రి సిదిరి అప్పలరాజు… అమరావతి ప్రాంత భూముల స్కాం ఆరోపణల్లో కొత్త వాదన తెర మీదకు తీసుకుని వచ్చిన ఆయన.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. రైతుల ముసుగులో చేస్తున్న పాదయాత్ర కచ్చితంగా అడ్డుకుని తీరుతాం అన్నారు.. ఈ విషయంలో చర్చే అవసరం లేదన్న ఆయన.. శ్రీకాకుళం పోరాటాల గడ్డ.. మా ప్రాంతానికి వచ్చి మా గుండెలపై కొడతాం అంటే ఊరుకుంటామా? అంటూ ఫైర్‌ అయ్యారు… ఇక, డిసెంబర్‌లో రాజధాని అని ప్రకటన వస్తే నవంబర్‌లో పయ్యావుల కేశవ్‌ రాజధాని ప్రాంతంలో భూమి కొనుగోలు చేసింది వాస్తవం కాదా? అని నిలదీశారు.. పయ్యావుల కేశవ్‌ సహా టీడీపీ నాయకులు నాలుగు వేల ఎకరాలకు పైగా భూములు అమరావతి ప్రాంతంలో ఎలా కొనుగోలు చేశారు? అంటూ మండిపడ్డారు.

ల్యాండ్ పూలింగ్ పేరుతో రెండు, మూడు లక్షల కోట్ల రూపాయల లబ్ది తన బినామీలకు దక్కేటట్లు చంద్రబాబు చేశారు అని ఆరోపించారు మంత్రి అప్పలరాజు.. 29 గ్రామాల్లోని తన బినామీల చేతిలో పది వేల ఎకరాలు అభివృద్ధి చేసిన భూమి పెట్టే విధంగా చట్టం చేశారని విమర్శించిన ఆయన.. రాజధాని ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉండకుండా చట్టంలో నిబంధనలు పెట్టిన చంద్రబాబుపై అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు.. అమరావతిని కమ్మ రాజధాని చేయాలన్నది చంద్రబాబు లక్ష్యం.. చంద్రబాబు లాంటి మేధావి ప్రపంచంలోనే ఉండడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సిదిరి అప్పలరాజు. కాగా, అమరావతి రైతులు రెండో దఫా పాదయాత్ర ప్రారంభం అయిన విషయం తెలిసిందే.. వెంకటపాలెంలో ప్రారంభమైన ఈ యాత్ర వెయ్యి కిలోమీటర్లు సాగి.. నవంబరు 11న శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యభగవానుడి సన్నిధికి చేరుతుందని ప్రకటించిన విషయం విదితమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here