Mobs Attacks in Dhone Area: డోన్ లో రెచ్చిపోతున్న అల్లరిమూకలు

0
1204

నంద్యాల జిల్లా డోన్ లో అల్లరిమూకల ఆగడాలు మితిమీరిపోయాయి. విద్యార్థులు గ్యాంగ్ లుగా ఏర్పడి వీధుల్లో కర్రలతో , రాళ్లతో కొట్టుకుంటుంటే…మరోవైవు రౌడీ గ్యాంగ్ లు కత్తులు, కర్రలు, వేట కొడవళ్ళతో రోడ్డుపైనే వీరంగం సృష్టిస్తున్నారు. అల్లరి మూకల ప్రవర్తనతో స్థానికులు, ప్రత్యేకించి మహిళలు, పిల్లలు భయపడిపోతున్నారు. డోన్ లో తరచూ వీధుల్లో గ్యాంగ్ వార్ లు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. తాజాగా డోన్ టీచర్స్ కాలనీలో నడి రోడ్డుపై యువకులు వీరంగం సృష్టించారు. రెండు గ్రూపుల మధ్య ఘర్షణతో స్థానికులు భయవుడి పోయారు. కర్రలతో కొట్టుకోవడంతో మహిళలు, చిన్నారులు వనికిపోయారు. ఘర్షణను సెల్ ఫోన్ లో స్థానికులు చిత్రీకరించారు. మరుసటి రోజే హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ వద్ద రోడ్డుపై యువకులు వీరంగం సృష్టించారు. స్థానికులు సెల్ ఫోన్ లో రికార్డ్ చేసినపుడు మీడియా దృష్టికి వస్తున్నాయి. బయటికి తెలియకుండా రౌడీ మూకలు కోకొల్లలుగా ఉన్నాయి.

డోన్ లో గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. జనం రద్దీగా ఉండే సేగు థియేటర్ ప్రాంతంలో బ్లేడ్లు, కత్తులు రాళ్లతో రౌడీ షీటర్లు కొట్టుకొని భయానక వాతావరణం సృష్టించారు. ఇందులో కొట్టుకున్న వాళ్లంతా మట్కా, గుట్కా, మద్యం , ఎర్రమట్టి మాఫియాలో ఉన్న ముఖ్యులు అనుచరులే. సుమారు 100 మంది రోడ్డుపై అరాచకాలు చేస్తుంటే పోలీసులు జస్ట్ చెదరగోట్టి చేతులు దులువుకున్నారు. ఈ ఘటనలో కేవలం నలుగురిపై కేసు నమోదు చేశారు. నెల రోజుల క్రితం రౌడీ మూకలు మద్యం మత్తులో దాడి చేనుకున్నారు. ఈ ఘటన విషయం మాట్లాడేందుకు ఇరువర్గాలు సేగు థియేటర్ ప్రాంతానికి చేరుకొని ఒకరిపై ఒకరు తలపడ్డారు. నలుగురికి తీవ్రంగా గాయపడ్డారు. నెల రోజుల క్రితం వైసీపీ ఆఫీసులోనే రాళ్లతో రెండు వర్గాలు కొట్టుకున్నాయి. వాహనాలను ధ్వంసం చేశారు.

డోన్ లో రౌడీ షీటర్లు, మట్కా, మద్యం మాఫియా అరాచకాలు సర్వసాధారణమయ్యాయి. కొన్నేళ్లుగా రౌడీలు రాజ్యమేలుతున్నారు. సామాన్య ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. రౌడీ షీటర్లు , అల్లరి మూకలు , మట్కా కంపెనీలు, మద్యం వ్యాపారంపై ఆధిపత్యం కోసం నిత్యం కత్తులు, ఇనుపరాడ్లతో పరస్పరం దాడులతో ప్రజలను హడలెత్తిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీస్ అధికారులు చోద్యం చూస్తున్నారు. జనవరి లో రైల్వే స్టేషన్ లో ఓ మహిళపై ఈ రౌడీ గ్యాంగ్ లు అత్యాచారయత్నం చేయడం, మహిళ ప్రతిగఘటించడంలో తల మెట్లకు తగిలి ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

డోన్ రైల్వే కూడలి, నేషనల్ హైవే కి పక్కనే ఉండడం, మైనింగ్ ఉన్న ప్రాంతం కావడంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇదే అక్రమ మద్యం వ్యాపారానికి, మట్కా మహమ్మారి విస్తరణకు అనుకూలంగా ఉంది. కొన్ని కుటుంబాలు దశబ్దాలుగా మట్కా నిర్వహణలో , అక్రమ మద్యం వ్యాపారంలో ఆరితేరిపోయాయి. మరికొందరు కొన్నేళ్లుగా మాత్రమే ఈ రంగంలోకి వచ్చారు. మద్యం వ్యాపారం, మట్కా విచ్చలవిడిగా నిర్వహిస్తారు. మద్యం వ్యాపారం, మట్కా నిర్వహణకు యువతను నియమించుకుంటున్నారు. ఈజీగా డబ్బులు రావడంతోపాటు బిరియాని, మందుకు కొరత లేకుండా ఉంటుందని పెద్ద సంఖ్యలో యువత నిర్వాహకుల వెంట వుంటున్నారు. మద్యం కర్ణాటక , తెలంగాణ నుంచి రైళ్లలో, ట్రాన్స్పోర్ట్ సంస్థల ద్వారా, వాహనాల్లో తెప్పించుకుంటున్నారు. నాటు సారా తయారీకి అడ్డు అదుపు లేదు.

డోన్ లో కొన్నేళ్లుగా మట్కా, మద్యం వ్యాపారుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. రౌడీ షీటర్లు, అల్లరి మూకలు తరచు బహిరంగంగానే కత్తులు, ఇనుపరాడ్లు కర్రలు చేతబట్టుకొని పరస్పరం దాడులు చేసుకుంటూ వీరంగం సృష్టిస్తున్నారు. ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఈ రౌడీషీటర్లు , అల్లరి మూకలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి రాజకీయ అండ ఉండేలా చూసుకుంటారు. గతంలో మట్కా, మద్యం వ్యాపారం నిర్వహిస్తున్న వారు, మరో మట్కా నిర్వాహకులపై కత్తులు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. జనవరిలో అందుకుబెప్రతీకరంగా కత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. డోన్ లో 48 మంది రౌడీ షీటర్లు వున్నారు. రౌడీషీట్లు లేని అల్లరి మూకలు వందల్లో వున్నారు. రౌడీ గ్యాంగ్ లు వందకు పైగానే ఉన్నాయంటే శాంతి భద్రతల పరిస్థితి ఎలా వుందో స్పష్టమవుతుంది.

డోన్ లో మద్యం, మట్కా మాఫియా అరాచకాలపై స్థానికుల్లో ఆందోళన ఉన్నా చెప్పడానికి భయపడుతున్నారు. పోలీసులు కూడా ఏమీ చేయలేరన్న అభిప్రాయం వారిలో ఉంది. గతంలో ఫిర్యాదు చేసినా రౌడీ షీటర్లపై చర్యలు లేకపోవడంతో మనకెందుకులే అనే భావనతో వున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here