ఆసియా కప్‌లో టీమిండియా ఆశించిన రీతిలో ఆడలేకపోయింది. పాకిస్థాన్, శ్రీలంక చేతిలో వరుసగా ఓడటంతో ఫైనల్ కూడా చేరలేకపోయింది. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచ కప్‌లో భారత ప్రదర్శన ఎలా ఉంటుందనే విషయం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. వచ్చేనెలలో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా జట్టును సెలక్టర్లు ప్రకటించారు. అయితే ప్రధాన బౌలర్ షమీని స్టాండ్ బైగా ప్రకటించడం విమర్శలకు తావిచ్చింది. షమీని తుది జట్టులోకి తీసుకోవాలని పలువురు సూచించారు. అయితే షమీని తుది జట్టులోకి తీసుకోకపోవడానికి గల కారణాలను బీసీసీఐ సెలక్టర్ తాజాగా వెల్లడించారు. మహమ్మద్ షమీ స్టాండ్‌బైగా ఉన్నా దాదాపు తుది జట్టులో ఉన్నట్లేనని ఆయన స్పష్టం చేశారు. గాయాలతో జట్టుకు దూరమై రీఎంట్రీ ఇస్తున్న హర్షల్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రాలకు బ్యాకప్‌గా అతడిని తీసుకున్నామని.. సొంతగడ్డపై ఈనెలలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో జరిగే టీ20 సిరీస్‌లలో ఈ ఇద్దరిలో ఎవరూ విఫలమైనా షమీ జట్టులోకి వస్తాడని బీసీసీఐ సెలక్టర్ తెలిపారు.