దేశంలో బీసీ గణన వెంటనే చేయాలి.. విజయసాయిరెడ్డి

0
1327

దేశంలో వెనుకబడిన తరగతులకు జనాభాకు తగినట్లుగా రిజర్వేషన్ కల్పించి వారి అభ్యున్నతి, సంక్షేమం న్యాయబద్ధంగా జరిగేలా చూడాలంటే బీసీల విద్యా, సామాజిక గణన జరగాలి. దీనికి వీలు కల్పించేలా రాజ్యాంగ సవరణ చేపట్టి కొత్తగా ఆర్టికల్ 342బీని చేర్చాలని ప్రతిపాదిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్ సభ్యుడి బిల్లును ప్రవేశపెట్టారు. అలాగే కేంద్ర ప్రభుత్వం సుంకాలు, సర్‌చార్జీల రూపంలో వసూలు చేస్తున్న రెవెన్యూలో రాష్ట్రాలకు కూడా వాటా ఇచ్చేలా రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 270, 271, 280ను సవరించాలని కోరుతూ విజయసాయి రెడ్డి మరో రాజ్యాంగ (సవరణ) బిల్లు, 2022ను సభలో ప్రవేశపెట్టారు.

దేశ జనాభా 68 కోట్లు ఉన్న సమయంలో వెనుకబడిన తరగతుల వారి సంఖ్య 52 శాతం ఉన్నట్లుగా 1980లో మండల్ కమిషన్‌ నిర్ధారించింది. ఇప్పుడు దేశ జనాభా 138 కోట్లకు చేరింది. అయినప్పటికీ ఇందులో బీసీల జనాభా ఎంత ఉందో కచ్చితంగా తెలియదు. విద్యా, సామాజికపరంగా బీసీల ప్రస్తుత స్థితిగతులు స్పష్టం కావాలంటే వెనుకబడిన కులాల గణన జరపడం అనివార్యం. అప్పుడే వారి అభ్యున్నతి, సంక్షేమం కోసం ప్రభుత్వం తదనుగణంగా విధానాలకు రూపకల్పన చేసి వాటిని విజయవంతంగా అమలు చేయగలుగుతుంది. కాబట్టి బీసీ కులాల గణన జరపాలని కోరుతూ ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతోందని విజయసాయి రెడ్డి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here