సంక్రాంతి వేళ ప్రేక్షకులకు అసలు, సిసలైన పండుగను పంచేందుకు సిద్ధం అయ్యారు మెగాస్టార్ చిరంజీవి, నటసింహా నందమూరి బాలకృష్ణ.. ఒకేరోజు తేడాతో ఈ సీనియర్ హీరోలు నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి.. ఈ నెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. మెగాస్టార్ చిరంజీవి.. వాల్తేరు వీరయ్య.. ఒక్కరోజు ఆలస్యంగా అంటే.. 13వ తేదీన విడుదల కాబోతోంది.. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి.. ఇక, సినిమాల కోసం అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు మెగాఫ్యాన్స్ ఎదురుచూస్తోన్నారు.. ఇప్పటికే పాజిటివ్ రివ్యూస్ కూడా ఉన్నాయి.. అయితే, ఈ రెండు సినిమాలపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.. రెండు సినిమాలకు అభినందనలు తెలుపుతూనే.. చిచ్చుపెట్టే కుట్ర జరుగుతోందని అనుమానాలను వ్యక్తం చేశారు.
వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలపై ట్వీట్ చేసిన లోకేష్.. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ ఆరోపించారు.. సంక్రాంతికి ప్రేక్షకులకు వినోదం పంచేందుకు వీర సింహారెడ్డిగా వస్తున్న బాల మావయ్య, వాల్తేరు వీరయ్యగా వస్తున్న చిరంజీవి గారికి శుభాకాంక్షలు.. అలరించే పాటలు, ఆలోచింపజేసే మాటలు, ఉర్రూతలూగించే డ్యాన్సులతో పూర్తిస్థాయి వినోదం అందించే ఈ చిత్రాలను కోట్లాది ప్రేక్షకులలో ఒకడిగా నేనూ చూడాలని తహతహలాడుతున్నా.. హీరోల పేరుతో, కులాల పేరుతో ఫేక్ పోస్టులు సృష్టించి.. విద్వేషాలు రెచ్చగొట్టేందుకు అధికార పార్టీ సన్నద్ధమైంది.. ఇద్దరు అగ్రహీరోల సినిమాలు విడుదలవుతున్న సందర్భాన్ని వాడుకుని సోషల్ మీడియాలో ఫేక్ ఖాతాల ద్వారా ఒక కులం పేరుతో మరో కులంపై విషం చిమ్మాలని కుట్రలు పన్నారని ఆరోపించారు.. విషప్రచారాలు చేసి కుల, మత, ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిల్చిన దుష్ట చరిత్ర కలిగినవారి ట్రాప్లో ఎవరూ పడొద్దు అని సూచించారు. సినిమాలు అంటే వినోదం.. సినిమాలను వివాదాలకు వాడుకోవాలనే అధికార పార్టీ కుతంత్రాలను తిప్పికొడదాం.. మనమంతా ఒక్కటే. కులం, మతం, ప్రాంతం ఏవీ మనల్ని విడదీయలేవు అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు నారా లోకేష్.