తిరుమలలో భక్తుల తాకిడి తగ్గుముఖం పట్టింది. గత ఆరు నెలలుగా కొనసాగుతున్న భక్తులు రద్దీ ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుంది. దీంతో రోజుల తరబడి శ్రీవారి దర్శనం కోసం వేచిచూసే పరిస్థితి నుంచి గంటల సమయంలోనే ఇప్పుడు స్వామివారి దర్శనభాగ్యం భక్తులకు లభిస్తోంది.
అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవారి దర్శనార్దం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూంటారు. 70 సంవత్సరాల క్రితం రోజుకి 600 మంది భక్తులు మాత్రమే తరలివచ్చే తిరుమలకు ప్రస్తుతం లక్ష మంది భక్తులు తరలివస్తున్నారు. కోవిడ్ కి పూర్వం 2019 లో శ్రీవారిని 2.8 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ తెలిపింది. అటు తరువాత కోవిడ్ కారణంగా శ్రీవారి ఆలయంలో 80 రోజుల పాటు స్వామివారి దర్శనభాగ్యం నిలిపివేశారు.
అటు తరువాత కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతించడంతో….ఆ ఏడాది శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 80 లక్షలకు పరిమితం అయ్యారు. అటు తరువాత ఏడాదికి కూడా కోటి నాలుగు లక్షల మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకున్నారు. ఇలా కోవిడ్ కారణంగా 30 శాతానికి పడిపోయిన శ్రీవారి భక్తుల సంఖ్య…ఈ ఏడాది మార్చి నుంచి సాధారణ స్థితికి చేరుకుంది. శ్రీవారి ఆలయంలో వున్న పరిస్థితులతో ప్రతి నిత్యం 80 నుంచి 90 వేల మంది భక్తులును మాత్రమే దర్శనానికి అనుమతించే అవకాశం వుండడంతో….గత మార్చి నుంచి ప్రతి నిత్యం కూడా అంతే సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
దీంతో ప్రతి నిత్యం కూడా క్యూలైనులు కిటికిటలాడాయి. వారాంతం వచ్చిందంటే చాలు క్యూలైనులు కిలోమిటర్లు మేర ఏర్పడ్డాయి. దీంతో సర్వదర్శనం కోసం 40 గంటల సమయం కూడా పట్టింది.ఇలా ఆరు నెలలుగా భక్తజనంతో కిటకిటలాడిన తిరుమలలో ఇప్పుడు భక్తులు రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. ఆరు నెలలు తరువాత మొదటిసారి క్యూ లైనులు బయటకి రాకూండా భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం లభిస్తోంది. కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు దర్శనాలు లేకపోవడంతో….సాధారణ పరిస్థితి రావడంతో గత ఆరు నెలలుగా శ్రీవారిని పెద్ద సంఖ్యలో దర్శించుకోని మొక్కులు చెల్లించుకున్న భక్తులు తాకిడి తగ్గింది.