ఎంతమంది మోసపోతున్నా.. జనంలో మాత్రం మార్పు రావడం లేదు. మీ ఫోన్ కి ఎలాంటి అనుమానాస్పద కాల్స్ వచ్చినా స్పందించవద్దని, మీ బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఓటీపీలు షేర్ చేయవద్దని ఎంత మొత్తుకున్నా జనంలో మార్సురావడం లేదు. లాటరీ టికెట్ కొనకపోయినా… మీకు లాటరీ వచ్చిందని చెబితే ఎవరు ఫోన్ చేసినా వారికి వ్యక్తిగత వివరాలు చెప్పేస్తున్నారు. కర్నూలులో ఓ మహిళ ఆరులక్షల రూపాయలు మోసపోయింది. కర్నూలు జిల్లా
బాబా బృందావన్ నగర్ లో ఈ మోసం బయటపడింది. ఆన్ లైన్ మోసానికి గురైన మహిళ ఇప్పుడు లబోదిబోమంటోంది.
లాటరీలో గిఫ్ట్ వచ్చిందని మహిళకు అగంతకుడు ఫోన్ చేశాడు. నిజమేనేమో తనకు లాటరీ వచ్చిందని భావించిన మహిళ వెంటనే ఆ ఫోన్ కాల్ కి స్పందించింది. 19 వేలు జిఎస్టీ పేరుతో అకౌంట్ లో వేయించుకున్నాడు అగంతకుడు.. అనంతరం మీ ఫోన్ కి ఓటీపీ వచ్చింది.. వెంటనే చెప్పమన్నాడు. ఏమాత్రం ఆలోచించని ఆమహిళ అగంతకుడికి ఓటీపీ చెప్పేసింది. ఇంకేముంది లాటరీ మాట దేవుడెరుగు ఆమె అకౌంట్లో డబ్బులు మాయం అయ్యాయి. లాటరీ పేరుతో ఓటీపీ తెలుసుకొని బ్యాంకు ఖాతాలో 5 లక్షల 69 వేలు కొట్టేశాడా అగంతకుడు. తాను మోసపోయానని, న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే వున్నాయి. సైబర్ క్రైం పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. అయినా జనంలో మార్పు రావడం లేదు. రోజూ వేలాదిమంది బాధితులు లేని దానికోసం ఆశపడి.. ఉన్నది పోగొట్టుకుంటున్నారు.