సూపర్ స్టార్ కృష్ణ.. ఆ బిరుదుని సార్థకం చేశారు.. పవన్

0
535

తెలుగు చిత్రపరిశ్రమలో తీరని విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో హైదరాబాద్ లో కన్నుమూశారు. కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యం అందించారు. అయితే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల ఆయన కన్నుమూశారు. సూపర్ స్టార్ కృష్ణ మృతికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన శ్రీ కృష్ణ గారు తుది శ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. శ్రీ కృష్ణ గారు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. శ్రీ కృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్నేహశీలి, మృదుస్వభావి అయిన శ్రీ కృష్ణ గారు ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. మద్రాస్ లో ఉన్నప్పటి నుంచి మా కుటుంబంతో చక్కటి అనుబంధం ఉందన్నారు పవన్ కళ్యాణ్.

తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా శ్రీ కృష్ణ గారు చేసిన సేవలు చిరస్మరణీయాలు. తెలుగు సినిమా పురోగమన ప్రస్థానంలో ఆయన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు. విభిన్న పాత్రలు పోషించిన శ్రీ కృష్ణ గారు కౌబోయ్, జేమ్స్ బాండ్ కథలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారు. పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా జీవితంలో కూడా ఆయన తన ముద్ర వేశారు. సినిమా రంగం క్షేమాన్ని కాంక్షించే శ్రీ కృష్ణ గారి మరణం తెలుగు చలనచిత్ర సీమకు తీరని లోటు. ఆయన కుమారుడు శ్రీ మహేష్ బాబు గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా అన్నారు పవన్ కళ్యాణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here